మిగిలిన స్థానాల్లో అసంతృప్తులను బుజ్జగించాకే పేర్ల ప్రకటన
నలుగురు సీనియర్లతో పాటు కొత్తగా చేరిన వారికి చోటు
మహబూబ్‌నగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ క్యాండిడేట్ల సెలక్షన్‌పై ఆచుతూచి అడుగులేస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వర్గ విభేదాలు, టికెట్ల కోసం పంచాయితీలు ఉన్న చోట్ల క్యాండిడేట్లను ఫైనల్ చేయడానికి మరో రెండు రోజుల టైం తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలు ఉండగా, 8 చోట్ల క్యాండిడేట్లను ప్రకటించింది. అందులో నలుగురు కొత్తగా పార్టీలో చేరిన వారు ఉండగా, మిగిలిన నలుగురు సీనియర్ లీడర్లు కావడం గమనార్హం.
ఇద్దరు బీసీలు.. నలుగురు ఓసీలకు..
ఉమ్మడి జిల్లాలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీక్యాండిడేట్లను ఫైనల్ చేసింది. కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, అచ్చంపేట నుంచి ఆ పార్టీ నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ, అలంపూర్ నుంచి ఎస్ఏ సంపత్‌కుమార్, షాద్‌నగర్ నుంచి వీర్లపల్లి శంకర్(కె.శంకరయ్య) పేర్లను ఖరారు చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యకు టికెట్ ఇచ్చారు.
అలాగే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కొడుకు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డికి టికెట్ కన్ఫాం చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కల్వకుర్తి టికెట్లు కన్ఫాం చేశారు. వీటిలో అలంపూర్, అచ్చంపేట ఎస్సీకి రిజర్వ్ కాగా.. గద్వాల, షాద్‌నగర్ సెగ్మెంట్లను బీసీలకు కేటాయించారు. మిగిలిన నాలుగు స్థానాల్లో మూడు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి వెలమ సామాజిక వర్గానికి కేటాయించారు. అయితే, ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు స్థానాలను బీసీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించగా, పాలమూరు పార్లమెంట్ పరిధిలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలనే ఇక్వేషన్స్లో భాగంగా నాగర్‌కర్నూల్ పరిధిలో బీసీలకు ఒక టికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
నాగర్‌కర్నూల్‌లో ఆరు.. పాలమూరులో రెండు..
కాంగ్రెస్ హైకమాండ్ ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లోని ఏడు స్థానాల్లో ఆరు చోట్ల, పాలమూరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండు చోట్ల మాత్రమే క్యాండిడేట్లను ఫైనల్ చేసింది. నాగర్‌కర్నూల్ పరిధిలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, గద్వాల, కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో అసమ్మతి ఉన్నా.. అక్కడి లీడర్లను మేనేజ్ చేయడంతో సమస్య సద్దుమణిగింది.
పాలమూరు పార్లమెంట్ పరిధిలో మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్లలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో క్యాండిడేట్లను ఫైనల్ చేయడం తలనొప్పిగా మారింది. ఇక్కడి లీడర్ల మధ్య సయోధ్య తెచ్చాకే ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై క్లారిటీ రానుంది. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, శివాసేనారెడ్డి, మేఘారెడ్డి మధ్య టికెట్ కోసం వార్ నడుస్తోంది. వీరిలో ఒకరికి టికెట్ ఇచ్చి, మిగిలిన ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
ఫస్ట్ లిస్ట్‌లో లేని జడ్చర్ల..
ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి జడ్చర్ల టికెట్‌పై సందిగ్ధత నెలకొంది. ఇక్కడి నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, కొద్ది నెలల కింద బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్ ఎర్ర శేఖర్ టికెట్ ఆశిస్తున్నారు. కాగా, గత నెల వీరి మధ్య హైకమాండ్ సయోధ్య కుదర్చిందని, జడ్చర్ల నుంచి అనిరుధ్‌రెడ్డి, నారాయణపేట నుంచి ఎర్ర శేఖర్ పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర నాయకుడు మీడియా సమావేశంలో కూడా పేర్కొన్నారు. ఫస్ట్ లిస్ట్‌లో జడ్చర్ల పేరు లేకపోవడంతో ఇక్కడి పంచాది ఇంకా సద్దుమణగలేదనే ప్రచారం నడుస్తోంది.
సీనియర్ల దారెటు?
నాగర్‌కర్నూల్ నుంచి మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కొల్లాపూర్ నుంచి జగదీశ్వర్‌రావు కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కొత్త వారికి కాకుండా నాగంకు టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్నారు. జగదీశ్వర్‌రావు కూడా టికెట్ తనకే వస్తుందనే ధీమాలో ఉన్నారు. కానీ, ఈ రెండు స్థానాల్లో పార్టీలో కొత్తగా చేరిన రాజేశ్, కృష్ణారావు వైపు హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో వీరు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వీరితో ఓ పార్టీకి చెందిన లీడర్లు సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఆ పార్టీ నుంచి టికెట్లు ఇస్తామని హామీ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ ఇద్దరు కూడా ఆ పార్టీ నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు గద్వాలలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన సరితకు టికెట్ ఇవ్వొద్దని ఢిల్లీలో నిరసన తెలిపారు. వారు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారనే చర్చ నడుస్తోంది.