కరీంనగర్‌‌‌‌‌‌‌‌ : ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

  • మానకొండూరులో అత్యధికం, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో అత్యల్పం 
  • పలుచోట్ల చెదురుముదురు ఘటనలు 
  •  ఓటు వేయడానికి ఆసక్తి చూపిన యువత

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు: ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  ఉదయం మొదటి రెండు గంటలు కొంత మందకొడిగా పోలింగ్ సాగినప్పటికీ.. ఆ తర్వాత  ఓటర్లు భారీగా పోలింగ్‌‌‌‌ కేంద్రాలకు తరలివచ్చారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత చాలా ఉత్సాహంగా తమ ఓటు వినియోగించుకున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. జిల్లాలో పోలింగ్ ప్రారంభం కాగానే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి.  పోలింగ్​ఆలస్యం కావడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.  కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో73.34శాతం , జగిత్యాల జిల్లాలో 74.87  , రాజన్నసిరిసిల్ల జిల్లాలో 70.17, పెద్దపల్లిలో జిల్లాలో 71శాతానికి పైగా నమోదైంది. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో 73.34శాతం... 

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ సిటీతోపాటు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలయ్యేసరికి లోపల పదుల సంఖ్యలో ఓటర్లు ఓటేసేందుకు క్యూలో నిల్చున్నారు.  మానకొండూరు నియోజకవర్గంలో అత్యధికంగా 81.32 శాతం నమోదైంది. చొప్పదండి నియోజకవర్గంలో  77.67 శాతం(రాత్రి వరకు), కరీంనగర్ లో 64.17(సాయంత్రం 5గంటల వరకు), హుజూరాబాద్ లో 70.23 శాతం ఓట్లు పోలయ్యాయి. జిల్లావ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ అభిషేక్ మహంతి సందర్శించి పోలింగ్ సరళి, ఏర్పాట్లను పరిశీలించారు.  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో మహిళల కోసం ఐదు, దివ్యాంగులు, యూత్ కు ఒక్కో మోడల్ పోలింగ్ సెంటర్​ఏర్పాటు చేసి మామిడి తోరణాలు, పూలతో అలంకరించి  ముగ్గులు వేయించారు.  

మానకొండూర్ మండలంలోని ఊటూర్ గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ కు చెందిన ఊటూర్ పీఏసీఎస్ చైర్మన్ ముద్దసాని ప్రదీప్ రెడ్డి, ముద్దసాని సుమంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28 సాయంత్రం 5 గంటల నుంచే వైన్స్, బార్ లు బంద్  చేయగా..  పోలింగ్ టైం ముగియగానే  వైన్స్, బార్ లు తెరవడంతో మద్యం ప్రియులు క్యూకట్టారు. 

రాజన్నసిరిసిల్ల జిల్లాలో 70.17

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సిరిసిల్లలో 73.42, వేములవాడలో 70.17 శాతం, మొత్తంగా జిల్లాలో 70.17 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సోషల్​వెల్ఫేర్​గురుకుల స్కూల్‌‌‌‌లోని రిసెప్షన్​సెంటర్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 

డబ్బు పంపిణీని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు

సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలంలోని ఆవునూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు పంచుతుండగా బీజేపీ నాయకులు పట్టుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నాయకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణీరుద్రమ మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్లలో డబ్బు, మద్యం పంచను, తాను చేసిన అభివృద్ధిని చూసే ఓటేస్తారని పదేపదే చెప్పిన కేటీఆర్.. డబ్బు పంపిణీపై ఏంచెబుతారని ప్రశ్నించారు. చందుర్తి మండలం జోగాపూర్  గ్రామంలో బీఆర్ఎస్ లీడర్లు డబ్బు పంచుతున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చేశారు. 

పెద్దపల్లిలో జిల్లాలో 71 శాతానికి పైగా 

పెద్దపల్లి, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గురువారం పోలింగ్​ ముగిసే సమయానికి  71 శాతానికి పైగానమోదైంది. పెద్దపల్లిలో 67.01, రామగుండంలో 67.21, మంథనిలో 74.12 శాతంగా నమోదైంది. సమస్యాత్మక నియోజకవర్గంగా గుర్తించిన మంథనిలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్​ముగిసింది, కాగా ఇన్​టైంలో పోలింగ్​ సెంటర్​ గేట్​ లోపల ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం 7 గంటలకు స్టార్ట్​ అయిన పోలింగ్​ 11 గంటల వరకు మందకొడిగా సాగింది.

మధ్యాహ్నం తర్వాత నుంచి స్పీడందుకుంది. జిల్లాకు చెందిన ప్రముఖులు, అభ్యర్థులు ఉదయం 11 లోపే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరమణరావు తన ఫ్యామిలీతో కలిసి సొంత గ్రామం శివపల్లిలో  ఓటేశారు. బీఆర్ఎస్​ అభ్యర్థి దాసరి మనోహర్​రెడ్డి తన ఫ్యామిలీతో పెద్దపల్లి మిషన్​ హైస్కూల్​లో ఓటు వేశారు. బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష పెద్దపల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్‌‌‌‌రావు తన సొంత గ్రామం వెంకట్రావుపల్లిలో ఓటు వేశారు. మంథని కాంగ్రెస్, బీఆర్​ఎస్​, బీజేపీ అభ్యర్థులు శ్రీధర్​బాబు, పుట్ట మధు, సునీల్​రెడ్డి మంథనిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామగుండం బీఆర్​ఎస్​ అభ్యర్థి చందర్​ గోదావరిఖనిలో, కాంగ్రెస్​ అభ్యర్థి మక్కాన్​సింగ్​ రామగుండం, బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి పాలకుర్తి మండలం లింగాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్​ మండలం గంగారంలో డబ్బులు పంచలేదని ఆ గ్రామ సర్పంచ్​ను​ గ్రామస్తులు నిలదీశారు. 

జగిత్యాలలో 74.87 శాతం ఓటింగ్

జగిత్యాల, వెలుగు: జిల్లాలో జిల్లాలో 74.87శాతం నమోదైంది. జగిత్యాలలో ఎన్నికల సరళిని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ అభ్యర్థి  జీవన్‌‌‌‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి పరిశీలించారు. అంతకుముందు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగారావు, బీజేపీ అభ్యర్థి అర్వింద్​, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ ఓటేశారు. జగిత్యాలలో 73.54, కోరుట్లలో 73.68, ధర్మపురిలో  77. 50 శాతం నమోదైంది. జిల్లాలో 36 మోడల్ పోలింగ్ కేంద్రాలు 
ఏర్పాటు చేశారు. 

అల్లీపూర్‌‌‌‌‌‌‌‌లో స్వల్ప ఘర్షణ

రాయికల్, వెలుగు: రాయికల్​ మండలం అల్లీపూర్​ గ్రామంలో బీఆర్ఎస్‌‌‌‌, కాంగ్రెస్​ వర్గీయల మధ్య గురువారం స్వల్ప వివాదం నెలకొంది. బీఆర్ఎస్‌‌‌‌కు చెందిన మహిళ కార్యకర్త ఒకరు పోలింగ్​స్టేషన్​లోకి వెళ్లి ప్రచారం చేయడం, వృద్దులతో మాట్లాడి ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుసుకున్న కాంగ్రెస్​ శ్రేణులు అడ్డుకొని ఆందోళనకు దిగారు.