హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో గెలుపెవరిది?

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు శాసనసభఎన్నికల నగారా మోగింది. గుజరాత్ లో 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తూ అధికారంలో కొనసాగుతున్నది. నవంబర్12న హిమాచల్ ప్రదేశ్ లో,  డిసెంబర్1, 5న గుజరాత్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.  ఎప్పుడూ బీజేపీ‌‌‌‌– కాంగ్రెస్​ మధ్యే ముఖాముఖి పోటీ ఉండేది. ఈసారి ఆమ్​ఆద్మీ పార్టీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో చిన్నా చితకా పార్టీలు ఎన్ని పోటీ చేసినా.. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే త్రిముఖ పోటీ ఉండబోతున్నది. హిమాచల్ లో 1993 నుంచి కాంగ్రెస్, బీజేపీల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తున్నది. కానీ గుజరాత్ లో మాత్రం 27 ఏండ్లుగా బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటున్నది. అయితే ఈసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో  రంగ ప్రవేశం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు ప్రధాన పార్టీలకు బలమైన పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది.

బీజేపీ పెద్దలకు అగ్నిపరీక్షే
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకు తన సొంత రాష్ట్రమైన హిమాచల్ శాసనసభ ఎన్నికలు పరీక్షగా మారాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు సొంత రాష్ట్రమైన గుజరాత్ శాసనసభ ఎన్నికల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.  ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది కాబట్టి, మళ్లీ పార్టీని గెలిపించి అధికారాన్ని నిలబెట్టుకోవటం నడ్డా, మోడీ, షాలకు ఒక సవాల్. అందుకే గుజరాత్, హిమాచల్ లో మోడీ తరచూ పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.1993 నుంచి ప్రతి ఐదేండ్లకు ఒకసారి ప్రభుత్వాలను మార్చే సంప్రదాయం ఉన్న హిమాచల్ లో బీజేపీని గెలిపించటం జేపీ నడ్డాకు కత్తి మీద సాము లాంటిదే.  ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ తో పాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధూమాల్ లాంటి వారు ఉన్నప్పటికీ ఏడాది క్రితం జరిగిన మండి లోక్ సభ ఉప ఎన్నికలో, శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవి చూడటం ఆ పార్టీ విజయంపై సందేహాలు కలిగిస్తున్నది. 

గుజరాత్ లో 27 ఏండ్లుగా విజయాలు సాధిస్తున్న బీజేపీని ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మోడీ, అమిత్ షాల పైనే ఉంది. పటేల్ సామాజిక వర్గం ఓట్లను పొందటానికి 2021లోనే విజయ్ రూపానీ స్థానంలో భూపేంద్ర భాయ్ పటేల్ ను పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. గుజరాత్, హిమాచల్ లో మరోసారి పార్టీని గెలిపించి మోడీ, అమిత్ షా, నడ్డాలు పార్టీలో తమ నాయకత్వానికి ఎదురు లేకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

బలమైన ప్రత్యామ్నాయంగా ఆప్
కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారిగా పోటీ చేస్తున్నా, ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా ప్రచారంలో దూసుకుపోతున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో  గెలిచిన విధంగానే ఈ రెండు రాష్ట్రాల్లోనూ గెలిచి, బీజేపీకి తామే బలమైన ప్రత్యామ్నాయం అని చాటుకోవాలని ఆప్ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే గుజరాత్ ప్రచారంలో ఆప్ ముందంజలో ఉన్నది. గుజరాత్ ఆప్​అధ్యక్షుడు  గోపాల్ ఇటాలియ పటిదార్ సామాజిక వర్గానికి చెందినవాడు. ప్రచారంలో  కేజ్రీవాల్, సిసోడియాలు గుజరాత్​ని చుట్టేస్తున్నారు.  ఇంతకు ముందు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్​ మెజార్టీ స్థానాలు సాధించింది.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు సాధిస్తామని ఆప్ నాయకత్వం భావిస్తున్నది. ఆప్‌‌ జాతీయ కార్యదర్శి ఇసుదన్‌‌ గాధ్విని గుజరాత్‌‌ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌ తాజాగా ప్రకటించారు.

అభివృద్ధి మంత్రంతో పాలకపక్షం, సమస్యలతో విపక్షం
పాలక పక్షం అభివృద్ధి మంత్రంతో, ప్రతిపక్షాలు సమస్యల ప్రస్తావనతో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ హిందుత్వ ఎజెండా బీజేపీ గెలుపు నినాదాలు కానున్నాయి.  ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నీటి కొరత, విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కోతలు,  రైతు సమస్యలు, బిల్ కిస్ బానోలాంటి ఉదంతాలు ప్రజల ముందు పెట్టి బీజేపీని ఓడించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. 10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య, ఆరోగ్యం, విద్యుత్, మహిళలకు నెలకు రూ.1000 హామీలతో ఆమ్ ఆద్మీ పార్టీ  ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు, దళిత వర్గాల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో  గెలిచిన విధంగానే  హిమాచల్ ప్రదేశ్, గుజరాత్​లో  గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకతను తట్టుకొని బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి రాజకీయంగా మరింత సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే 2024 లోక్ సభ ఎన్నికలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. వివిధ జాతీయ సర్వే సంస్థల ప్రకారంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ మరోసారి గెలుస్తుందని తెలుస్తున్నది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో నిర్ణేతలు ప్రజలే.

కాంగ్రెస్​ను గెలిపించే వారేరి?
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో  కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ, పార్టీని గెలిపించే నాయకత్వం కొరత కనపడుతున్నది.  2017 హిమాచల్ శాసనసభ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే కేవలం ఏడు శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయి. అలాగే గుజరాత్ లో హోరాహోరీగా జరిగిన పోరులో కాంగ్రెస్ 77 శాసనసభ స్థానాలు గెలిచి తన బలాన్ని చాటుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో వీరభద్ర సింగ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నది. గుజరాత్ లో హార్దిక్ పటేల్, అల్ఫేస్ ఠాకూర్, అశ్వినీ కొత్వాల్ లాంటివాళ్లు పార్టీని వీడటంతో గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. సోనియా గాంధీ అనారోగ్య కారణాల వల్ల, రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో ఉండటం వల్ల, ఈ రెండు రాష్ట్రాల్లో వారు ప్రచార బాధ్యతలు చేపట్టకపోవచ్చు. ప్రియాంకా గాంధీ, కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చుతారనే సందేహాలు ఉన్నాయి.

‘‘దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వరదల సమస్యను ఆధునిక సైన్స్​అండ్​టెక్నాలజీ పరిష్కరిస్తుంది. ఇందులో భాగంగానే ఆచరణీయ పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని కేంద్రం భావిస్తున్నది’’
- గజేంద్ర సింగ్ ​షెకావత్, కేంద్రమంత్రి

‘‘రాష్ట్రంలో మా మధ్య ఎలాంటి సవాళ్లు లేవు. అందరం కలిసి పనిచేస్తున్నాం. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయి. అంతమాత్రాన వాటిని ఎందుకు చెడుగా చూడాలి. ఆశలు నెరవేర్చుకోవడానికి కొందరు అనుసరించే మార్గం భిన్నంగా ఉంటుంది’’
- అశోక్​ గెహ్లాట్, రాజస్థాన్ ​సీఎం

“నేను ఎప్పుడు నిద్రపోతానో అని ప్రజలు అడుగుతుంటారు. సీఎం అంటే నా దృష్టిలో కామన్​మ్యానే. అందుకే నేను సామాన్యుడికి ముఖ్యమంత్రిగా ఉంటాను. నేను, దేవేంద్ర ఫడ్నవీస్​ కలిసి పనిచేస్తున్నం. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నది. గత మూడు నెలల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక ముఖ్య నిర్ణయాలు తీసుకున్నాం’’
- ఏక్​నాథ్​ షిండే, మహారాష్ట్ర సీఎం

- డా. తిరునహరి శేషు పొలిటికల్​ఎనలిస్ట్