- ఆసిఫాబాద్ కాంగ్రెస్ఆశావహుల్లో ఆందోళన
- టికెట్‌కోసం దరఖాస్తు చేసుకున్న శ్యాంనాయక్
- బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి గట్టి పోటీ
ఆసిఫాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏజెన్సీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనే లక్ష్యంతో అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ సైతం అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఈ ఎన్నికల్లో పోటీ కోసం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఖానాపూర్ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ రెండ్రోజుల క్రితమే కాంగ్రెస్‌లో చేరారు.
వెంటనే ఆసిఫాబాద్టికెట్కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. టికెట్ పై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించిందని కూడా ఆయన వర్గం చెప్పుకుంటోంది. పార్టీలో చేరిన అనంతరం ఆసిఫాబాద్ కు చేరుకున్న ఆయన మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలో శ్యామ్ నాయక్ చేరిక పలువురు నాయకులకు మింగుడు పడటంలేదు. టికెట్ రేసులో ఉన్న పలువురు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అయితే, ఏడాది కాలంగా తాము పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నామని అధిష్టానం తమను గుర్తిస్తుందనే కొద్ది నమ్మకంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్లో కలవరం
బీఆర్ఎస్ అధిష్టానం ఆసిఫాబాద్ టికెట్‌ను జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి కేటాయించింది. పార్టీ చేపట్టిన సర్వే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కంటే కోవ
లక్ష్మికి సానుకూలంగా రావడంతో ఆమెకే టికెట్కన్ఫర్మ్ చేశారు. లక్ష్మి బలమైనఅభ్యర్థి కావడంతో ఆమెను తట్టుకునే కెపాసిటీ ప్రతిపక్షాలకు ఉందా అనే చర్చ కూడా అప్పుడే మొదలైంది. దీంతో కాంగ్రెస్.. శ్యాం నాయక్‌ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
రెండేండ్లుగా ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అక్కడ వాలిపోయి ప్రజలకు దగ్గరవుతున్నారు.కోవ లక్ష్మిని ఢీకొనాలంటే మరింత బలమైన లీడర్ పార్టీకి అవసరమని భావించిన నాయకులు శ్యామ్ నాయక్ ను పేరును అధిష్టానానికి ప్రతిపాదించారని, ఆయనకే టికెట్ఇవ్వనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి
ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇప్పటివరకు కోవ లక్ష్మి సోదరి, ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతితోపాటు డాక్టర్ గణేశ్ రాథోడ్, రాథోడ్ శేషారావు పేర్లు వినిపించాయి. కొంతకాలంగా విస్తృతంగా తిరుగుతూ ప్రజలతో కలిసిపోయారు. తమకే టికెట్వస్తుందని ఆశిస్తున్న వీరంతా శ్యాం నాయక్ ఎంట్రీతో ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ఇస్తే ఇంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమ నేతల పరిస్థితి ఏమిటని వారి మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ శ్యాం నాయక్‌కు టికెట్ఇస్తే వీరంతా అతడికి మద్దతుగా నిలుస్తారా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. దీంతో అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.