
- లోక్‌సభ ఎన్నికలతోపాటే నిర్వహిస్తామన్న ఈసీ
- ఫలితాలు జూన్ 4న వెల్లడి
- దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
- సీఈసీ రాజీవ్ కుమార్ వివరణ
న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిసా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎలక్షన్స్ జరుగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. సార్వత్రిక ఎన్నికలతోపాటే వీటిని కూడా నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకునేందుకు 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలుండగా 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ పార్టీ 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. మొత్తం 49.5 శాతం ఓట్లుసాధించింది. 23 సీట్లతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకొన్నది. 2024 ఎన్నికల్లో టీడీపీ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో కలిసి ఆరేండ్ల తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరింది. .
సిక్కిం : సిక్కింలో 2019లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 32 అసెంబ్లీ స్థానాలకుగానూ 17 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. 15 సీట్లతో సిక్కిం డెమొక్రటిక్ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ప్రతిపక్ష స్థానాన్ని పొందింది.
అరుణాచల్ ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్‌లో 2019లో బీజేపీ అధికారాన్ని దక్కించుకొన్నది. 60 అసెంబ్లీ సీట్లకుగానూ ఆ పార్టీ 41 స్థానాల్లో విజయం సాధించింది. జనతా దళ్ (యునైటెడ్) 7, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 5, కాంగ్రెస్ 4, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 1 సీటు గెలుచుకొన్నాయి. కాగా, 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బుధవారం 60 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
ఒడిసా : 2019 ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదల్ (బీజేడీ) పార్టీ 147 అసెంబ్లీ సీట్లకుగానూ 112 గెలుచుకొని అధికారం దక్కించుకొన్నది. నవీన్ పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు. దేశంలోనే ఓ రాష్ట్రానికి అత్యధిక సార్లు సీఎంగా పనిచేసిన పవన్ చామ్లింగ్ (సిక్కిం), జ్యోతి బసు (బెంగాల్) రికార్డును సమం చేశారు. కాగా, ఎన్నికల్ షెడ్యూల్ వచ్చినా బీజేపీ, బీజేడీ పొత్తుపై సందిగ్ధం వీడలేదు.