మహా ఎన్నికలు ప్రశాంతం.. రాష్ట్రంలో 58.22 శాతం పోలింగ్

మహా ఎన్నికలు ప్రశాంతం.. రాష్ట్రంలో  58.22 శాతం పోలింగ్

ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్​లలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి బుధవారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 58.22 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, జార్ఖండ్​లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు దఫాల్లో పోలింగ్ నిర్వహించారు. ఫేజ్ 2లో భాగంగా బుధవారం 38 సెగ్మెంట్​లకు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 67.59 శాతం పోలింగ్ రికార్డయింది. అదేవిధంగా 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ, రెండు లోక్​సభ నియోజకవర్గాలకు బై ఎలక్షన్లు నిర్వహించారు. 23వ తేదీన అన్ని స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు.

ముంబైలో ఓటింగ్ అత్యల్పం

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలీలో సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 69.63 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా, ముంబై సిటీలో అత్యల్పంగా 49.07 శాతం, ఠానే డిస్ట్రిక్​లో 49.76 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది. ఎప్పటిలాగే ముంబై సిటీ వాసులు ఓటేసేందుకు ఆసక్తి చూపించలేదు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ వార్ధా జిల్లాలో ఎన్​సీపీ (ఎస్పీ) నేత నితీశ్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. బీడ్ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బాలాసాహెబ్ షిండే.. పోలింగ్ బూత్​లో గుండెపోటుతో చనిపోయారు. నాసిక్​లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఓటర్లంతా వేలికి ఇంక్ పెట్టుకుని వేచి చూడాల్సి వచ్చింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్​సీపీ తరఫున పర్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి ధనంజయ్ ముండే అనుచరులు ఈవీఎంను ధ్వంసం చేశారు. నందన్​గావ్​లో శివసేన అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మధ్య గొడవ జరిగింది.

జార్ఖండ్​లో ప్రిసైడింగ్ ఆఫీసర్ రీప్లేస్

జార్ఖండ్​లో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రూలింగ్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఎంపీ నిశికాంత్ దూబే ఫిర్యాదుతో మధుపూర్ అసెంబ్లీ సెగ్మెంట్​లో ప్రిసైడింగ్ ఆఫీసర్​ను ఈసీ అధికారులు రీప్లేస్ చేశారు. అదేవిధంగా, పంజాబ్‌‌లోని డేరా పఠానా గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పోలీసులు రంగంలోకి దిగి, ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌‌ కేంద్రాల్లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీంతో ఏడుగురు పోలీసులను ఈసీ సస్పెండ్ చేసింది.

మహారాష్ట్రలో ఓటేసిన 110 ఏండ్లు దాటిన వృద్ధులు

మహారాష్ట్రలో 110 ఏండ్లు పైబడిన ఇద్దరు వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైకి చెందిన 113 ఏండ్ల కంచన్​బెహన్ వీల్​చైర్​లో వెళ్లి ఓటేశారు. ప్రతీ లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కంచన్​ బెహన్ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. విదర్భ రీజియన్ గడ్చిరోలిలోనూ 111 ఏండ్ల ఫుల్​మతి వినోద్ సర్కార్ ఓటేశారు. ఆమె 1913, జనవరి 1న జన్మించింది. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెకు ఎన్నికల సిబ్బంది వీల్​చైర్ ఏర్పాటు చేశారు. 85 ఏండ్లు పైబడిన వృద్ధుల కోసం ఈసీ అధికారులు హోం ఓటింగ్ ఏర్పాటు చేసినా.. ఆమె మాత్రం పోలింగ్ బూత్​కు వచ్చి ఓటేసింది.