పొలిటికల్ వినాయకులు.. ఖమ్మం జిల్లాలో ఒక్కో మండపానికి రూ.50 వేలు ఆఫర్

  • ఖమ్మం జిల్లాలో ఒక్కో మండపానికి రూ.50 వేలు ఆఫర్
  • మండపాల నిర్వాహకులతో టచ్​లోకి వివిధ పార్టీల నేతలు
  • విగ్రహంతోపాటు ఖర్చులు భరిస్తామంటూ హామీలు 
  • నెల రోజుల కిందే బల్క్​గా విగ్రహాలు తెప్పించి పెట్టిన నేతలు 

ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జనానికి దగ్గరయ్యే ఏ ఒక్క అవకాశాన్నీ రాజకీయ పార్టీలు వదులుకోవడం లేదు. ఏదో ఒక రకంగా ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పండుగలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. త్వరలో వినాయక చవితి ఉండడంతో అన్ని పార్టీల లీడర్లు మండపాల నిర్వాహకులతో టచ్​లోకి వెళ్తున్నారు. దాతలు, చందాల కోసం తిరగాల్సిన పని లేదని, విగ్రహంతోపాటు ఉత్సవాల ఖర్చు తామే భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. ప్రతి గల్లీలో విగ్రహం పెట్టేలా ప్లాన్​చేస్తున్నారు. ఒక్కో మండపానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు స్పాన్సర్​చేస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో ఏటా విగ్రహాలు పెట్టేవారితోపాటు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకొని మరి గణనాథులను ప్రతిష్టించేందుకు ప్లాన్​చేస్తున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 వేల విగ్రహాలు ఏర్పాటు కాగా, పొలిటికల్​లీడర్ల ఎంట్రీతో ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

ప్రతి గల్లీలో తమ ఫ్లెక్సీ ఉండేలా..

ఖమ్మంలో ఏటా వినాయక మండపాల కోసం అన్ని పర్మిషన్లు, విద్యుత్​కనెక్షన్​కోసం అయ్యే ఖర్చును మంత్రి పువ్వాడ అజయ్​కు చెందిన పువ్వాడ ఫౌండేషన్ చెల్లిస్తోంది. ఈసారి కూడా అదే తరహాలో ముందుకు వచ్చే చాన్స్​ఉంది. ఇక అధికార పార్టీ లీడర్లకు హైకమాండ్​నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వినాయక చవితిని ఓన్ చేసుకొని గ్రాండ్​ గా సెలబ్రేట్​ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్​సహా వివిధ ప్రాంతాల నుంచి బల్క్ గా విగ్రహాలు తెప్పిస్తున్నారు. ప్రతి గల్లీలో తమ బ్యానర్​తో మండపం ఉండేలా ప్లాన్​చేస్తున్నారు. దాతలతో పనిలేకుండా ఈసారి అన్నదానాలకు అవసరం అయ్యే బియ్యం, కూరగాయలు కూడా తామే సప్లయ్​చేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. స్టేజీ నిర్మాణం నుంచి విగ్రహ నిమజ్జనం వరకు అన్ని ఖర్చులు తామే చూసుకుంటామని కొందరు చెబుతుండగా, మండపానికి రూ.50 వేల చొప్పున ఇచ్చేందుకు కాంగ్రెస్​పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత సిద్ధమయ్యారు. 

విగ్రహాలకు ఫుల్​డిమాండ్​

పొలిటికల్ లీడర్ల ఎంట్రీతో ఈసారి వినాయక విగ్రహాలకు డిమాండ్​పెరిగింది. గతంలో పండుగకు మూడు వారాల ముందు నుంచి విగ్రహాలు బుక్ అయ్యేవని, ఈసారి సెప్టెంబర్​18న పండుగ ఉండగా, ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచే బుకింగ్స్​మొదలయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. 4 నుంచి 8 అడుగుల లోపు విగ్రహాలకు ఫుల్ డిమాండ్ ​ఉందని, రూ.15 వేల లోపు ధర ఉన్న విగ్రహాలు ఎక్కువ మంది ప్రిఫర్​చేస్తున్నారని అంటున్నారు. బడా విగ్రహాలను హైదరాబాద్ ​నుంచి తెప్పిస్తున్నారని తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత సూర్యాపేటలో వినాయక విగ్రహాలను తయారు చేయించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్టోర్​చేస్తున్నారు. గతేడాది వినాయకచవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటు కోసం అప్లికేషన్లు పెట్టుకున్న వారి డేటా సేకరించి, కమిటీ సభ్యులను పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడిస్తున్నారు. ఈసారి గణపతి విగ్రహం తామే ఇస్తామని, ఇతర ఖర్చుల కోసం రూ.30 వేల వరకు స్పాన్సర్ చేస్తామని చెబుతున్నారు. మరో పార్టీకి చెందిన నేత విగ్రహాలతో సంబంధం లేకుండా ప్రతి మండపానికి రూ.50 వేలు ఇస్తామంటూ ఆఫర్​ఇస్తున్నారు.’’

నెల రోజులుగా కొంటున్నారు

ఖమ్మంలో 15 ఏండ్లుగా వినాయక విగ్రహాల వ్యాపారం చేస్తున్నాను. ఇతర రాష్ట్రాల కళాకారులతో విగ్రహాలు చేయించి అమ్ముతున్నా. యేటా పండుగకు రెండు వారాల ముందు నుంచి మాత్రమే బుకింగ్స్​ ​జరిగేవి. ఈసారి ఆగస్టు ఫస్ట్​ నుంచే అడ్వాన్సులు ఇచ్చి పోతున్నారు. విగ్రహాల ధరలేమీ పెంచలేదు. కానీ చాలా మంది హైదరాబాద్​ నుంచి బల్క్​గా విగ్రహాలు తెప్పిస్తున్నారు.

రాజశేఖర్, విగ్రహాల వ్యాపారి, ఖమ్మం

మండపాలు పెరుగుతున్నయ్​

ఖమ్మం సిటీలో ఏటా అపార్ట్ మెంట్లలో 350, రోడ్ల మీద 600 నుంచి 700 వరకు విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. ఈసారి భారీగా పెరిగే అవకాశముంది. వివిధ పార్టీల నాయకులు ఐదారు అడుగుల లోపు విగ్రహాలను స్పాన్సర్​ చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొత్తవారు కూడా నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసుకొని, విగ్రహాలను పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.  – వేల్పుల సుధాకర్, గణేష్ ఉత్సవ సమితి, ఖమ్మం