మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్​ టైమ్​!

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్​లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో పవర్​లో ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవటం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలి లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవటం, ప్రధాని మోడీ ఇమేజీ, కేంద్రం ఈమధ్య తీసుకున్న సంచలన నిర్ణయాలు అసెంబ్లీ ఎలక్షన్స్​లో బీజేపీ గెలుపును నల్లేరుపై నడకలా మార్చనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

లోక్​సభ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని ఖాతాలో వేసుకున్న బీజేపీ మరోసారి అసెంబ్లీ ఎన్నికల మోడ్​లోకి వెళ్లిపోయింది. మహారాష్ట్ర, హర్యానాల్లో అక్టోబర్​లో ఎన్నికలు జరుగుతాయి. జార్ఖండ్​ శాసన సభకు నవబంర్​ లేదా డిసెంబర్​లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల కన్నా చాలా ముందంజలో దూసుకుపోతోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హర్యానా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ యాత్రల పేరుతో క్యాంపెయిన్​ చేస్తున్నారు.

కేంద్రంలో బీజేపీ మరోసారి పవర్​లోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మూడు చోట్లా కమలనాథుల చేతిలోనే అధికారం ఉంది. రెండో టర్మ్​లోని తొలి వంద రోజుల్లో మోడీ సర్కార్​ పనితీరు బీజేపీకి మరింత ప్లస్ కానుందనే టాక్​ వినిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ను​ తీసేసి ఆ రాష్ట్రాన్ని ఇండియాతో సెంట్​పర్సెంట్​ కనెక్ట్​ చేయటం ద్వారా దేశవ్యాప్తంగా మళ్లీ జాతీయ భావాన్ని రగిలించారు. అయితే, యాంటీ–ఇంకంబెన్సీ గండం లేకపోలేదు. పోయినేడాది చివరలో జరిగిన మధ్యప్రదేశ్​, రాజస్థాన్​ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నది. కాంగ్రెస్​ అధికారం దక్కించుకుంది. లోక్​సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఫుల్​ మెజారిటీ సాధించగలిగింది. మిక్స్​డ్​ రిజల్ట్స్​ నేపథ్యంలో సునాయాసంగా యాంటి ఇంకంబెన్సీని దాటేస్తామన్న ధీమాతో ఉన్నారు మహారాష్ట్ర, హర్యానా బీజేపీ నాయకులు.

అపొజిషన్​ బలహీనత మరో పాజిటివ్​ అంశం

ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రధాన పోటీదారు కాంగ్రెస్​ పార్టీనే. ఇది అధికార పార్టీకి కలిసొచ్చే మరో అంశమని ఎనలిస్టులు అంటున్నారు. ఎందుకంటే హస్తం పార్టీ మరీ అంత బలంగా లేదు. జార్ఖండ్​లో కూడా బీజేపీని సొంతంగా ఢీకొనే శక్తిసామర్థ్యాల్లేక లోకల్​ పార్టీ జార్ఖండ్​ ముక్తి మోర్చా (జేఎంఎం)తో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. హర్యానాలో పీసీసీ పగ్గాలను నిన్నగాక మొన్ననే కుమారి షెల్జాకు అప్పగించింది. ఆమె లీడర్​షిప్​పై పీసీసీ వర్గాల్లో నమ్మకం లేదు. ఎందుకంటే, షెల్జా ఎప్పుడూ హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో లేరు. 1991లో మొదటిసారి సిర్నా (హర్యానా) నుంచి గెలిచి పీవీ నరసింహారావు కేబినెట్​లో సహాయ మంత్రిగా పనిచేశారు. 1996లో సిర్సా, 2004, 2009ల ఎన్నికల్లో అంబాలా నియోజకర్గాలనుంచి గెలిచారు. ప్రస్తుతం రాజ్యసభ మెంబర్​గా ఉన్నారు. లోకల్​ పాలిటిక్స్​పై పట్టు సాధించేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని కాంగ్రెస్​ వర్గాలు అంటున్నాయి. ఈ లోటును భర్తీ చేయటానికి ఎలక్షన్​ కమిటీ హెడ్​గా మాజీ సీఎం, సీనియర్ లీడర్​ భూపిందర్ ​హూడాను నియమించింది. హర్యానాలో హస్తం పార్టీ పూర్తి స్థాయిలో ఎలక్షన్​ క్యాంపెయిన్​ ప్రారంభించాల్సి ఉంది.

మరోవైపు… బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తోంది. ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​ గత నెల (ఆగస్టు) 18న ‘జన్​ ఆశీర్వాద్​ యాత్ర’ చేపట్టి జనంలోకి వెళ్లిపోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన పట్ల బీజేపీ హైకమాండ్​ కూడా సంతృప్తిగానే ఉందని పరిశీలకులంటున్నారు.

హర్యానాలో మోడీ ప్రచారం

రిజర్వేషన్ల కోసం జాట్​ల నిరసనల్ని, డేరా బాబా రామ్​ రహీమ్​ను అరెస్ట్​ చేసినప్పుడు జరిగిన అల్లర్లనూ సీఎం ఖట్టర్ సరిగ్గా డీల్​ చేయలేదన్న అసంతృప్తి వ్యక్తమైనా ఇప్పుడు అవన్నీ సర్దుకున్నాయి. ప్రస్తుతం ఆయన చాలా స్ట్రాంగ్​ పొజిషన్​లో ఉన్నట్లు కనిపిస్తోంది.  ప్రధాని మోడీ, పార్టీ చీఫ్​ అమిత్ ​షా అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే మోడీ హర్యానాలో ప్రచారాన్ని మొదలెట్టేశారు. రోహతక్​లో ఆదివారం ‘విజయ్​ సంకల్ప్’ ర్యాలీ జరిపారు. మెగా ఫుడ్​ పార్క్​తో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ వంద రోజుల్లో తమ సర్కారు చేసిన పనుల్ని, పార్లమెంట్​లో పాస్​ చేయించిన బిల్లుల్ని జనాలకు తెలియజేశారు.  దీంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీలో గొడవలు, దేవీలాల్​ ఫ్యామిలీకి చెందిన ఐఎన్​ఎల్​డీలో చీలిక బీజేపీ సక్సెస్​ను మరింత సింపుల్​గా మారుస్తాయంటున్నారు ఎనలిస్టులు.

జార్ఖండ్​లోనూ సై…

జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికలకూ బీజేపీ రెడీ అవుతోంది. ప్రధాని మోడీని సైతం ఎన్నికల ప్రచారానికి రప్పించాలని చూస్తోంది. ఈ నెల 12న రాంచీలో జరిపే ర్యాలీలో ఆయన పాల్గొనే ఛాన్స్​ ఉంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం జేఎంఎం. ఈ పార్టీ ట్రైబల్​ ఓట్లను నమ్ముకుంది. బీజేపీ గత ఎన్నికల్లో నాన్​–ట్రైబల్​ వ్యక్తి (రఘువర్ ​దాస్​)ని సీఎం చేసింది. మరోసారి అప్పర్​ క్యాస్ట్​ ఓట్లు రాబట్టాలన్న ప్లాన్​తో ప్రచారానికి వెళ్లబోతోంది. ట్రైబల్​ ఓట్ల కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్​ ముండాను ఎన్నికల ప్రచారంలోకి దింపనుంది. అభివృద్ధి పనుల విషయంలో రఘువర్ ​దాస్​ సర్కారు మరింత మెరుగ్గా పనిచేసి ఉంటే బాగుండేది. అయినా ఆయన నాయకత్వంలోనే జార్ఖండ్​లో  మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ ఆశిస్తోంది.

మహారాష్ట్రలోకూడా ఇదే సీన్​

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​.. ‘మహా జనదేశ్​ యాత్ర’ చేపట్టారు. ఇది బీజేపీ మైలేజీని పెంచింది. భారీ వర్షాలు, వరదల వల్ల ఈ యాత్రను ఏకబిగిన కాకుండా రెండు దశల్లో నిర్వహించారు. 2014లో మాదిరిగానే ఈసారికూడా శివసేనతో కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. సీట్ల సర్దుబాటుపై ఫైనల్​ డెసిషన్​ తీసుకోవలసి ఉంది. లోక్​సభ ఎన్నికలకు ముందు కొంతకాలం శివసేన అటు ఇటు ఊగిసలాడింది. ఒక దశలో తమ అధికార పత్రిక ‘సామ్నా’లో మోడీ సర్కారుని, ఆయన విధానాలను తీవ్రంగా విమర్శించింది.  చివరికి బీజేపీ ప్రెసిడెంట్​ అమిత్​ షా చొరవతో రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అదే తీరుగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తుకి రెడీ అయ్యాయి. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి ప్రధాన పోటీదార్లు కాంగ్రెస్​, ఎన్​సీపీలే.  ఆ రెండు పార్టీల్లోనూ లీడర్ల మధ్య యూనిటీ లేదు. వీళ్ల కుమ్ములాటలే ప్రతిపక్షాలకు ప్రధానంగా మైనస్​ కావచ్చని అంచనా. మహారాష్ట్రలో హస్తం పార్టీకి చెప్పుకోదగ్గ సీనియర్​ నేత లేరు. ఫలితంగా చోటా మోటా నాయకులను ఏకతాటిపైకి తేవటం కష్టంగా మారింది.  ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​ తన పార్టీ కార్యకర్తలు బీజేపీ తదితర పార్టీల్లోకి జారిపోకుండా కాపాడుకోవటానికే టైమంతా కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే ఎన్​సీపీ లీడర్లు టికెట్ల కోసం అధికార బీజేపీ ఆఫీసులో కర్చీఫ్​లు వేసి ఉంచారు.  సొంత పార్టీ ఆదరించి టికెట్​ ఇవ్వకపోతే కాషాయ పార్టీలోకి జంప్​ చేయటానికి రెడీగా ఉన్నారు. ఎన్సీపీలో శరద్​ పవార్​ కూతురు సుప్రియ సూలేకి, ఆమె పెదనాన్న కొడుకు అజిత్​ పవార్​కి మధ్య పొసగట్లేదు. వాళ్లిద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి శరద్​ పవార్ శాయశక్తులా కృషి చేస్తున్నారు.

‘టినా’ ఫ్యాక్టరా మజాకా​!

హర్యానాలో సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్​కు ఇప్పుడు తిరుగులేదనడానికి ఆయన అభిమానులు ‘టినా’ (టీఐఎన్​ఏ) ఫ్యాక్టర్​ ఎంచుకున్నారు. టినా అంటే ‘దేర్​ ఈజ్​ నో ఆల్టర్నేటివ్​’ అని అర్థం. లోక్​సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ పదికి పది సీట్లు కైవసం చేసుకుంది. మాజీ సీఎం భూపిందర్​ హుడా, ఆయన కుమారుడు దీపేంద్ర కూడా ఓడిపోయారు. దీనికితోడు బీజేపీ నాన్​–జాట్​ కార్డ్​ ప్రయోగిస్తోంది. తద్వారా పెద్ద కులాలు, బనియాలు, వ్యాపారులు, ఓబీసీల ఓట్లకు గాలమేస్తోంది. సీఎం ఖట్టర్​ కూడా ట్రేడ్​ సెగ్మెంట్​కే చెందిన వ్యక్తి కావటం చెప్పుకోదగ్గ విషయం.