సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరుగుతోంది. క్వశ్చన్ అవర్ సందర్భంగా.. సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలువురు సభ్యులు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ హయాంలో రోడ్లను పట్టించుకోలేదన్నారు. 2014 నుంచి సర్పంచ్ ల బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఆనాడు సర్పంచ్ లకు బీఆర్ఎస్ బిల్లులు చెల్లిస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీకి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని తెలిపారు సీతక్క. ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్డు వేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి తండాకు రోడ్డు వేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో 12 వే లకోట్లతో 17 వేల కిలో మీటర్ల రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ఆదివాసి గూడెంలలో రోడ్డు వేయడానికి సమస్యలు ఉన్నాయన్నారు.
Also Read : తెలంగాణలో లెదర్ పరిశ్రమలను పునరుద్దరిస్తాం
మంత్రి సీతక్క వ్యాఖ్యలపై మాట్లాడిన హరీశ్ రావు.. ఏడాదిగా జీపీలలలో పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు. కేసీఆర్ హయాంలో జీపీలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు నిధులిస్తుంది.. కానీ చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు . రూ. 691 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కాంగ్రెస్సేనన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టిస్తోందన్నారు. సర్పంచ్,ఎంపీటీసీలు,జడ్పీటీసీలకు జీతాలు ఇవ్వట్లేదన్నారు. చలో అసెంబ్లీకి వచ్చిన సర్పంచ్ లను అరెస్ట్ చేశారని తెలిపారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా సర్పంచును గోస పెడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు.