వికారాబాద్/చేవెళ్ల, వెలుగు: అనంతగిరిలో పర్యాటక రంగం అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదిరిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో రూ.80 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు స్విడ్జర్లాండ్, దావోస్ లో పర్యటించి రికార్డు స్థాయిలో లక్షా 72 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పారు.
అందులో అనంతగిరిలో పర్యాటక రంగం అభివృద్ధికి మెగా ప్రైవేట్ లిమిటెడ్ తో వెయ్యి కోట్ల ఒప్పందమైందన్నారు. మన్నెగూడ-, వికారాబాద్, -తాండూరు, -జహీరాబాద్, -బీదర్ రోడ్డు నిర్మాణానికి రూ.400 కోట్లతో, వికారాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు రూ.800 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్ది పాల్గొన్నారు. అలాగే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి గడ్డం ప్రసాద్ కుమార్ రామయ్యగూడ హౌజింగ్ బోర్డు కాలనీలో అమృత్ 2.0 పథకం కింద రూ.12 కోట్లతో మంచి నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు.