- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ ముగింపు సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్
- తెలుసుకున్న విషయాలు వచ్చే సమావేశాల్లో పాటించాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: మనం ఎంత నేర్చుకున్నా.. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఉన్నత విలువలు గల ప్రజాప్రతినిధిగా మనల్ని సమాజం గుర్తిస్తుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో రెండు రోజుల పాటు జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ ముగింపు ప్రోగ్రామ్ లో స్పీకర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి అధికారికంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, వారికి శాసన వ్యవహారాలపై అవగాహన కల్పించామన్నారు.
సభ్యులు కూడా వీటిపై తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరచడం సంతోషకరమన్నారు. రెండు రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా ఉభయ సభల్లో తమ హక్కులు, బాధ్యతలు ఏమిటనేది సభ్యులు తెలుసుకున్నారని చెప్పారు. తెలుసుకున్న విషయాలు వచ్చే సమావేశాల్లో అమలు చేస్తే సభ్యులకు మంచి పేరు, గౌరవం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన పీఆర్ఎస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ఎక్స్‌పర్ట్స్‌కు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. సదస్సు నిర్వాహణకు సహకరించిన ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులోనూ నిర్వహిస్తం: సుఖేందర్ రెడ్డి
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎమ్మెల్సీలు, -ఎమ్మెల్యేలకు లేజిస్లేచర్ విధి-విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం సహకరిస్తే త్వరలోనే అసెంబ్లీ, శాసన మండలికి సంబంధించిన అన్ని కమిటీలను నియమిస్తామన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను త్వరలోనే స్టడీ టూర్ లకు పంపిస్తామని, సభ్యులకు క్రీడా పోటీలను నిర్వహిస్తామని అన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏ ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారో.. అది నెరవేరేలా సభ్యులు సభలో వ్యవహరించాలని సూచించారు.
ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చకు అసెంబ్లీ, మండలి సమావేశాలు వేదికగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, ఎమ్మెల్సీ కోదండరాం, లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. చివరి రోజు శిక్షణ ప్రోగ్రామ్ లో 17 మంది ఎమ్మెల్సీలు, 61 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆ తర్వాత పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గోల్కొండలోని తారామతి బారాధరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, సభ్యులు పాల్గొన్నారు.