
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా అభివృద్ధే తన కర్తవ్యమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కోట్ పల్లి, బంట్వారం మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంగళవారం ఆయన చెక్కులు అందజేశారు.
అనంతరం ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి పనిచేస్తానన్నారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన అందరికీ చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జి.అంజయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ డానియల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.