గండిపేట/బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తోందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. రుణమాఫి, రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలని అమలు చేస్తోందన్నారు. బుధవారం ఆయన రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. కాలేజీ ఆడిటోరియంలో విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పాల్గొని ప్రసంగించారు.
వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య నేతృత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నిధులు, నియామకాలు, బోధన, బోధనేతర సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, వీసీ జానయ్యతో కలిసి సీఎంను కలిసి చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఎస్.రాజుఉస్తాద్, సంస్థ విద్యా విభాగం అధ్యక్షుడు పచ్చా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేమువందనం తదితరులు పాల్గొన్నారు. అలాగే ట్రస్మా నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను బుధవారం స్పీకర్ ప్రసాద్కుమార్ఆవిష్కరించారు.