చర్చలు సమగ్రంగా జరగాలి : స్పీకర్ ప్రసాద్ కుమార్

 చర్చలు సమగ్రంగా జరగాలి : స్పీకర్ ప్రసాద్ కుమార్
  • సభ్యులు అడిగిన సమాచారాన్ని వెంటనే అందించాలి: స్పీకర్ ప్రసాద్ కుమార్ 
  • అసెంబ్లీ సెషన్ పై స్పీకర్, చైర్మన్ మీటింగ్ 
  • మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డీజీపీ, సీపీ హాజరు
  • కొత్త ఎమ్మెల్యేలను పోలీసులు గుర్తించటం లేదన్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై  ప్రభుత్వ, పోలీసు అధికారులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తో పాటు హోం, ఫైనాన్స్, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, గత సెషన్ కు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్ లో ఉన్న సమాధానాలను వెంటనే పంపించాలని సీఎస్ ను ఆదేశించారు. సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే పంపినట్లయితే వాటిని సభ్యులు చదువుకొని సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందన్నారు. 

శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని స్పీకర్ కోరారు. శాసనసభ,  మండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుఫున చర్యలు తీసుకోవాలని, సభ లోపల, పరిసరాలలో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు సజావుగా సాగుతాయన్నారు.

ప్రొటోకాల్​ వివాదాలు రావొద్దు

జిల్లాల పర్యటనలో ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఉల్లంఘన జరుగుతుందని, ప్రొటోకాల్ విషయంలో వివాదాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. శాసనమండలి పరిసరాలలో చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖదని, పొరపాట్లు జరగకుండా, సభ సజావుగా జరిగే విధంగా సహకరించాలన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాన గేట్ల వద్ద ఉండే పోలీసు సిబ్బంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను గుర్తించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. ప్రొటోకాల్ ఉల్లంఘన సంఘటనలపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు. 

నిషేధిత వస్తువులు తీసుకురానీయొద్దు

సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. తనిఖీలు చేపట్టి సమావేశ మందిరంలోకి నిషేధిత వస్తువులను సభలోకి తీసుకురాకుండా చూడాలని ఆదేశించారు. చైర్మన్, స్పీకర్ ల పర్యటనల్లో ప్రొటోకాల్ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని గౌరవ, మర్యాదలతో చూడాల్సిన బాధ్యతను మర్చిపోరాదని అన్నారు. సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నలకు వివిధ శాఖల నుంచి నిర్దేశించిన గడువులోగా సమాధానాలు వచ్చే విధంగా సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీలు అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.