గెలుపు గుర్రాలకే అసెంబ్లీ టికెట్లు : ఎంపీ ధర్మపురి అర్వింద్​

జగిత్యాల/మెట్ పల్లి, వెలుగు: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఇద్దరు, ముగ్గురు టికెట్లు ఆశిస్తున్నారని, గెలుపు గుర్రాలకే హైకమాండ్​టికెట్ ఇస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రం, మెట్‌పల్లి మండలం గండి హనుమాన్ టెంపుల్ సమీపంలో నిర్వహించిన మహాజన్ సంపర్క్ అభియాన్‌ కార్యక్రమాల్లో అర్వింద్​పాల్గొని మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 24 గంటలు కరెంట్ అందుతోందని, డ్రగ్స్ మత్తులో ఉండే మంత్రి కేటీఆర్​కు కనబడడం లేదని విమర్శించారు. బీజేపీ వసుదైక కుటుంబమని, అంత్యోదయ కాన్సెప్ట్​తో నడుస్తోందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవడం చేతకాదన్నారు. 

ALSO READ :హైదరాబాద్ లో 19, 20 తేదీల్లో తాగునీళ్లు బంద్

కేంద్రం, రాష్ట్రంలో ఒంటెత్తు పోకడలతో కుల, మత రాజకీయాలు చేసి కాంగ్రెస్​పతనావస్థకు చేరిందని ఎద్దేవా చేశారు. పార్టీల్లో పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, బండి సంజయ్ తన పదవీ కాలాన్ని సక్సెస్ ఫుల్​గా కంప్లీట్ చేశారన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఉచ్చు బిగుస్తోందని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పాక.. తాము బి–టీమ్ ఎలా అవుతామని ప్రశ్నించారు. గత రెండు టర్మ్​లలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో మూడో వంతు పార్టీ మారారని విమర్శించారు. పసుపు బోర్డు హామీకి మించి రైతులకు మేలు చేశామని, ఉద్యమంలో పాల్గొన్న రైతుల్లో సగానికి పైగా బీజేపీలోనే ఉన్నారని తెలిపారు. 

బీజేపీ కార్యకర్తల్లో కుటుంబ వాతావరణం కల్పించేందుకే టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, సురభి నవీన్ కుమార్, సునీత   పాల్గొన్నారు.