అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ
అప్లికేషన్ల అప్‌లోడ్ లింక్ బ్లాక్
డైలమాలో 3 లక్షల మంది
పాత రిజిస్ట్రేషన్లకు మ్యుటేషన్‌పైనా క్లారిటీ లేదు
హైదరాబాద్, వెలుగు: ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం నిలిపేసింది. అప్లికేషన్లను తీసుకోవద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మ్యుటేషన్ అప్లికేషన్లు అప్‌లోడ్ చేసే లింక్‌ను బ్లాక్‌లో పెట్టినట్టు సమాచారం. దీంతో ఆ ప్రాసెస్ కోసం మున్సిపల్ ఆఫీసులకు వస్తున్న ప్రజలను ఆఫీసర్లు తిప్పి పంపిస్తున్నారు. ప్రభుత్వం సడన్‌గా మ్యుటేషన్‌ను ఆపేయడంతో సుమారు 3 లక్షల మంది కొనుగోలుదారులు అయోమయంలో పడిపోయారు. కొత్త రెవెన్యూ యాక్టు తెచ్చేందుకు గత నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపేసిన ప్రభుత్వం.. సరిగ్గా నెల తర్వాత మ్యుటేషన్‌కు బ్రేకులేసింది.
అన్నీ గుట్టుచప్పుడుగానే..
ప్రజలతో నేరుగా సంబంధమున్న సేవలను ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే హఠాత్తుగా నిలిపివేయడం సర్కారుకు పరిపాటిగా మారింది. చెప్పాపెట్టకుండా సెప్టెంబర్ 7 న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కొత్త రెవెన్యూ యాక్టు ప్రకారం ధరణి అందుబాటులోకి వచ్చేవరకూ రిజిస్ట్రేషన్లు ఉండవంది. రిజిస్ట్రేషన్‌కు బ్రేకులు వేశాక ఇంతకాలం మ్యుటేషన్ చేయించుకోని వారు వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పలేదు. ప్రజలను అలర్ట్ చేయకుండా ఉన్నపళంగా ప్రక్రియను నిలిపేసింది.
మ్యుటేషన్‌కు నిర్ణీత గడువేం లేదు
ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకుని మ్యుటేషన్ చేయించుకోని వారు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది ఉన్నారని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ పరిసరాల్లోని కార్పొరేషన్ల పరిధిలో ఎక్కువగా ఉన్నారంటున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్స్‌తో మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకుంటే మారెట్క్ వాల్యూలో 0.1 శాతం ఫీజును తీసుకుని మ్యుటేషన్ చేస్తుంటారు. ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక నిర్ణీత గడువులోపు మ్యుటేషన్ చేయించుకోవాలనే రూలేం లేదు. ఎప్పుడైనా చేయించుకుని వెసులుబాటుంది. దీంతో కొందరు 10, 15 ఏండ్ల కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తులను ఇంకా మ్యుటేషన్ చేయించుకోలేదు.
పాత రిజిస్ట్రేషన్ల మ్యుటేషన్ బాధ్యత ఎవరిది?
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 7 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అప్పటివరకు వరకు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను ఎవరు మ్యుటేషన్ చేస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కొత్త రెవెన్యూ యాక్టు ప్రకారం అగ్రికల్చర్ ఆస్తులను తహసీల్దార్లు, నాన్ అగ్రికల్చర్ ఆస్తులను సబ్-రిజిస్ట్రార్లు మ్యుటేషన్ చేస్తారు. మరి పాత రిజిస్ట్రేషన్లకు మ్యుటేషన్ చేసే పవర్స్‌ను సబ్ రిజిస్ట్రార్లకు ఇస్తారా? లేక నిర్ణిత గడువులోపు ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారా స్పష్టత లేదు.
మంగళవారం సాయంత్రం వరకు మ్యుటేషన్ దరఖాస్తులను తీసుకున్నం. బుధవారం ఆఫీసుకొచ్చి మ్యుటేషన్ చేసే లింక్‌ను కట్ చేశారు. పై ఆఫీసర్లను ఆడిగితే ఇక నుంచి మ్యుటేషన్ అప్లికేషన్లు తీసుకోవద్దన్నారు.
– జీహెచ్ంఎసీ సికింద్రాబాద్ జోన్‌లోని ఓ ఆఫీసర్
పదేళ్ల కింద ప్లాట్ కొన్నా. ఇంతకాలం మ్యుటేషన్ చేయించుకోలే. ఆస్తుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించుకునే మ్యుటేషన్ చేయించుకుందామని కాప్రా జోనల్ ఆఫీస్‌కు వెళ్లా. సర్వీసు నిలిపేసినట్టు
స్టాఫ్ చెప్పారు
– నాచారానికి చెందిన వ్యక్తి
మా తాత నాకు ఇల్లును గిఫ్ట్ డీడ్ చేశారు. దాన్ని మ్యుటేషన్ చేయించుకునేందుకు మున్సిపల్ ఆఫీసుకు వెళ్లా. దరఖాస్తులు తీసుకోవట్లేదని చెప్తున్నారు.
– వరంగల్ అదాలత్ ప్రాంతానికి చెందిన యువతి
For More News..
అక్టోబర్ 31 వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవద్దు
కల్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యరు.. లోన్లు అడిగితే ఇచ్చే దిక్కు లేదు..
సిటీలో 1,13,824 రాంగ్ అండ్ ఫేక్ నంబర్ ప్లేట్స్