- ఇంటి పన్ను చెల్లించేవారికి వెబ్ పోర్టల్ లింక్ మెసేజ్
- వరికి వారే వివరాలు నమోదు చేసుకునే అవకాశం
పల్లెల్లో ఆస్తుల సర్వేకు సిగ్నల్స్ సమస్యగా మారాయి. కొన్నిచోట్ల సిబ్బంది సిగ్నల్స్ కోసం ఇండ్ల మీదికెక్కుతున్నారు. గడ బొంగులకు సిగ్నల్స్ డివైజ్ తగిలించి పట్టుకుని ఇలా ఇంటింటికీ తిరుగుతున్నారు.
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు, ఇండ్ల మ్యాపింగ్ ఆరు రోజులుగా సాగుతోంది. బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లతోపాటు ఎంటమాలజీ, శానిటేషన్, స్పోర్ట్స్ తదితర డిపార్ట్‌మెంట్ల ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నమోదు చేస్తున్నారు. ఆస్తుల మ్యాపింగ్‌ను ఈ నెల 10వ తేదీతో ముగించాలని టార్గెట్‌గా పెట్టుకున్నప్పటికీ ఇప్పటి దాక సగం ఇండ్ల మ్యాపింగ్ కాలేదు. దీంతో ఆఫీసర్లు ఇంటి పన్ను చెల్లించే ఓనర్లు డైరెక్ట్ గా ఆన్‌లైన్‌లో తమ ఆస్తి, ఫ్యామిలీ డీటైల్స్ అప్‌లోడ్ చేసుకునే చాన్స్ ఇచ్చారు.ఇందుకోసం మీ సేవ పోర్టల్ లింక్‌ను రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ చేస్తున్నారు. ఈ లింక్ ద్వారా ముందుగా రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో అడిగిన వివరాలు నమోదు చేయవచ్చు.
రోజుకు ఒక్కొక్కరు 15 ఎంట్రీలు..
ఆస్తుల నమోదులో భాగంగా ఇల్లు/ఫ్లాట్ ఓనర్‌తోపాటు ఫ్యామిలీ ఆధార్ నంబర్లు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నంబర్, వాటర్ ట్యాప్ నంబర్(ఉంటే), సేల్ డీడ్/ నోటరీ/ గిఫ్ట్/ పార్టిషియన్/ సాదాబైనామా, ఓనర్ ఫోన్ నంబర్, రేషన్ కార్డు(ఉంటే) నంబర్, బిల్డప్ ఏరియా, మొత్తం ఏరియా, అన్‌డివైడెడ్ ఏరియా(అపార్ట్‌మెంట్స్)ను ఎంట్రీ చేస్తున్నారు. ఇందులో ఓనర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్‌లో 380 మంది బిల్ కలెక్టర్లు, 170 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరి పరిధిలో సుమారు 2 వేల ఇళ్ల వరకు ఉన్నాయి. బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లతో సర్వే పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో వీరికి సాయంగా పది మంది సహాయకులను నియమించారు. నయోదు కోసం వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే.. మరుసటి రోజు సిబ్బంది రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు 30 ఇండ్లు మ్యాపింగ్ చేయాలని టార్గెట్ విధించినా.. 15కి మించి చేయలేకపోతున్నామని సిబ్బంది అంటున్నారు.