ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ పై విచారించింది. ప్రతివాదులకు పిటిషన్ కాపీలు ముందే అందించాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన జరిగినా.. ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకాలు పూర్తి కాలేదు. భౌగోళికంగా, పరిపాలనా పరంగా విభజన జరిగినా.. అస్తులు, అప్పుల పంపిణీలో తరచూ వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. నీటి వనరుల వినియోగంలోనూ ఏటా జల వివాదాలు కొనసాగుతున్నాయి. సమస్యలకు చెక్ పెట్టి పరిష్కరించుకునేందుకు పలుమార్లు చర్చలు జరిగినా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఇంకా అపరిష్కృతంగా ఉన్న కేసుల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండడం రెండు రాష్ట్రాల ప్రజలనే కాదు పాలకులను సైతం ప్రభావితం చేస్తోంది.