
మంచిర్యాల, వెలుగు : భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం చేసినందుకు మంచిర్యాల ఆర్డీవో ఆఫీస్ ఆస్తులను గురువారం కోర్టు జప్తు చేసింది. కోటపల్లి మండలం పారుపల్లి శివారులోని 479, 480 సర్వే నంబర్లలో ముగ్గురు పట్టాదారులకు చెందిన 23.27 ఎకరాలను పట్టుపరిశ్రమ కోసం 1982లో ఐటీడీఏ ఆధ్వర్యంలో సేకరించారు. దీనికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించకపోవడంతో పట్టాదారులు కోర్టును ఆశ్రయించారు.
ఎకరానికి రూ.48 వేల చొప్పున పరిహారం, మార్కెట్ వ్యాల్యూకు అదనంగా 12 శాతంతో మరో రూ.34 లక్షలు, మానసిక ఇబ్బందులకు గురిచేసినందుగానూ రూ.3.40 లక్షలతో పాటు 2008లో తీర్పు వెలువడే వరకు అన్ని ఖర్చులు కలిపి రూ.2,92,93,283 చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. దీంతో ఆర్డీవో ఆఫీస్ ప్రాపర్టీ అటాచ్‌మెంట్ కోసం 2017లో మంచిర్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు.
దీంతో ఆర్డీవో ఆఫీస్ ఆస్తులను అటాచ్ చేయాలని జడ్జి ఉదయ్‌కుమార్ గత అక్టోబర్‌లో తీర్పు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కోర్టు సిబ్బంది డీసీఎం వ్యాన్‌తో వచ్చి కంప్యూటర్లు, టేబుళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని టైం కోరడంతో తిరిగి వెళ్లిపోయారు. తిరిగి గురువారం సాయంత్రం మళ్లీ వచ్చి ఆర్డీవో ఆఫీస్‌లోని కంప్యూటర్లు, చైర్లు, టేబుళ్లు సహా ఆర్డీవో చైర్, టేబుల్‌ను సైతం తీసుకెళ్లడంతో ఆఫీస్ మొత్తం ఖాళీ అయింది.