ఇండ్ల పట్టాల పేరుతో.. అసైన్డ్​ భూములు గుంజుకుంటున్రు

ఇండ్ల పట్టాల పేరుతో.. అసైన్డ్​ భూములు గుంజుకుంటున్రు
  • సాగు చేస్తున్నా చేయడం లేదని రెవెన్యూ ఆఫీసర్ల తప్పుడు రిపోర్ట్
  • మ్యాప్​ తయారు చేసి పట్టాలు అందించేందుకు లీడర్ల స్కెచ్

గద్వాల, వెలుగు: రాళ్లు రప్పలు తీసేసి కొన్నేండ్లుగా సాగు చేస్తున్న భూములను ఇండ్ల పట్టాల పేరుతో గుంజుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. గద్వాల మండలం పరమాల శివారులోని సర్వే నంబర్ 194లో 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ సర్వే నెంబర్ లోని భూమిని 1974లో గద్వాల మండలంలోని కురువపల్లి, పరమాల, దౌదర్​పల్లి గ్రామాల్లోని 40 మందికి గవర్నమెంట్  ఇచ్చింది. 

గుట్టలు, రాళ్లు, రప్పలు ఉన్న భూమని పంటల సాగు కోసం అనువుగా తీర్చిదిద్దుకున్నారు. అప్పటి నుంచి ఆ భూమిలో పంటలు పండించుకుంటూ బతుకుతున్నారు. ఆ భూములపై కన్నేసిన ఆఫీసర్లు భూమి సాగు చేయడం లేదంటూ రెండు నెలల కింద నోటీసులు ఇచ్చారు. భూమి సాగు చేసుకుంటున్నామని నోటీసులకు సమాధానం ఇచ్చినా, అవేమి పట్టించుకోకుండా అసైన్డ్  ల్యాండ్​లో మూడేండ్లుగా పంటలు వేయడం లేదని భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు నోటీసులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా వారం రోజులుగా కొంత భూమిని జేసీబీలతో చదును​ చేస్తున్నారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

పేదల భూములే టార్గెట్..

ప్రభుత్వ ఆఫీసులు, ఇతరత్రా అవసరాల కోసం పేదల భూములను స్వాధీనం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. డబుల్  బెడ్రూం ఇండ్లు, నర్సింగ్  కాలేజ్  కోసం గద్వాల పట్టణంలోని దౌదర్ పల్లి దర్గా దగ్గర గతంలో నిరుపేదలకు ఇచ్చిన ఇండ్ల పట్టాలు గుంజుకొని డబుల్  ఇండ్లు, నర్సింగ్  కాలేజీ కడుతున్నారు. ఇండ్ల స్థలాలు కోల్పోయిన వారికి ఇప్పటివరకు న్యాయం చేయలేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆగ్రహంగా ఉన్న నిరుపేదలకు ఎక్కడో ఒకచోట ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలున్నాయి.

సాగు చేస్తున్నా తప్పుడు రిపోర్టులు..

194 సర్వే నెంబర్ లోని 70 ఎకరాల భూమిలో 8 ఎకరాలు భూమి బండ రాళ్లతో సాగుకు పనికి రాకుండా ఉంది. మిగిలిన 62 ఎకరాల భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. ఫీల్డ్ విజిట్  చేయకుండానే ఆర్ఐలు సాగు చేయడం లేదని తప్పుడు రిపోర్టు ఇచ్చారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం అక్కడ కంది, సజ్జలు, ఆముదం వంటి ఆరుతడి పంటలు సాగు చేస్తున్నామని ఫీల్డ్  విజిట్  చేసి ఉంటే రెవెన్యూ ఆఫీసర్లకు అవి కనిపించేవని రైతులు పేర్కొంటున్నారు. ఫీల్డ్ లో లేరని తప్పుడు రిపోర్టులు ఇచ్చి తమ కడుపులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల పట్టణానికి దూరంగా ఇండ్లు నిర్మించుకునేందుకు అనువుగా లేని స్థలంలో ఇండ్ల పట్టాలు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పట్టాలు ఇచ్చామని చెప్పుకోవడానికి తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్లాట్లు ఇచ్చేందుకు మ్యాప్  రెడీ..

సర్వే నెంబర్ 194 లోని 36 ఎకరాల్లో 1109 ప్లాట్లు ఇచ్చేందుకు ఆఫీసర్లు ఇప్పటికే మ్యాప్  రెడీ చేశారు. బీపీఎల్  కింద ఒక్కొక్కరికీ 75 గజాల చొప్పున ఇచ్చేందుకు సర్వే చేసి హద్దులు పెట్టారు. అయితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, ప్రస్తుతం పనులు నిలిపేశారు. 

ఎన్నో ఏండ్లుగా  సాగు చేస్తున్న..

సర్వే నెంబర్ 194/11/2 లో 2 ఎకరాల 20 గుంటల పొలం ఉంది. నాన్న జమ్మన్న 11 ఏండ్ల కింద చనిపోతే వారసత్వంగా ఆ భూమి వచ్చింది. పొలం గుంజుకుంటామంటూ నోటీసు ఇచ్చిన్రు. దానికి జవాబు ఇచ్చినా తీసేసుకుంటున్నట్లు ఆర్డర్  ఇచ్చారు. భూమి గుంజుకుంటే మా కుటుంబం పరిస్థితి ఏంది?- 
పరశురాముడు, రైతు, కురువపల్లె 

నోటీసులు ఇచ్చింది వాస్తవమే..

పరమాల శివారులోని 194 సర్వే నెంబర్ లో ఉన్న రైతులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. భూములు రైతులు సాగు చేసుకుంటున్న విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాం. సాగు చేయడం లేదని ఇచ్చిన రిపోర్ట్ పై ఆరా తీస్తాం. 
నరేందర్, తహసీల్దార్, గద్వాల.