- దళారులకు సహకరిస్తున్న ఆఫీసర్లు
- అసైన్డ్ భూముల్లోనూ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు
గద్వాల, వెలుగు: అసైన్డ్ భూములను పాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు అలంపూర్ ఏరియాలో అసెస్ మెంట్ ముసుగులో ప్లాట్ల దందా జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను క్లియర్ చేయకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు అసెస్ మెంట్ పేరుతో అక్రమాలకు తెరలేపి అసైన్డ్ భూములను ప్లాట్లుగా మార్చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
ఖాళీ స్థలాలకు కూడా ఇంటి అసెస్ మెంట్ నంబర్ ఇచ్చేసి కోట్ల విలువ చేసే భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. గద్వాల జిల్లా కేంద్రంతో పాటు ఉండవెల్లి మండలం పుల్లూరు, అలంపూర్ చౌరస్తాలోని భుములు, ఇంటి స్థలాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అలంపూర్ చౌరస్తాలో సెంటు భూమి రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతోంది.
స్థలాలకు ఇంటి నెంబర్లు..
అలంపూర్ చౌరస్తా తో పాటు పుల్లూరులోని 273, 273ఆ/1, 250, 251 సర్వే నంబర్లలో భూములన్నీ అసైన్డ్ భూములే. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోయినప్పటికీ సీలింగ్ భూమిలో 30 సెంట్లలో గతంలోనే ఇల్లు నిర్మించినట్లు (ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది) అసెస్ మెంట్ ద్వారా ఆన్ లైన్లో నమోదు చేయించుకొని ఇంటి నంబర్ మంజురు కావడంతో ఇంటి పన్ను కట్టి రశీదు తీసుకున్నారు.
ఆ ప్రూఫ్ తో రిజిస్ట్రేషన్ ఆఫీసులోని వారికి పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పి 30 సెంట్లలో శిథిలమైన ఇల్లు ఉన్నట్లు అలంపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అలంపూర్ చౌరస్తాకు చెందిన ఒక వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేసేశారు. రిజిస్ట్రేషన్ చేసిన స్థలం బహిరంగ మార్కెట్లో సెంటు రూ.20 లక్షలకు పైగా పలుకుతోంది. అంటే సమారు రూ.5 కోట్ల విలువైన అసైన్డ్ ల్యాండ్‌ను అమ్మేశారని అర్థం చేసుకోవచ్చు.
అలాగే 250, 251 సర్వే నంబర్లలోని వ్యవసాయ భూముల్లో పాత ఇండ్లు ఉన్నట్లు అసెస్మెంట్ నంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. 250 సీలో అనుభవదారుల నుంచి గతంలో సెంటు రూ.20 వేల లెక్కన కొనుగోలు చేసి, ఉండవెల్లిలోని ఒక వ్యక్తికి సెంటు రూ.2 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. అలంపూర్ చౌరస్తాలో ఎక్కడ లిటిగేషన్ భూమి కనిపించినా అక్కడ దళారులు వాలిపోయి అక్రమ దందాలకు తెరలేపి కోట్లు దండుకుంటున్నారనే
ఆరోపణలున్నాయి.
పంచాయతీ సెక్రటరీల చేతివాటం..
అసెస్ మెంట్ వ్యవహారంలో పంచాయతీ సెక్రటరీలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పుల్లూరు పంచాయతీ పరిధిలోని కిష్టన్న అనే వ్యక్తికి ఐదుగురు కొడుకులు ఉండగా, గ్రామ సెక్రటరీ కిష్టన్న పేరుపై ఉన్న ఖాళీ స్థలానికి అసెస్ మెంట్ నంబర్ ఇచ్చేయడంతో ఆ వ్యక్తి ఆ నంబర్ పై రిజిస్ట్రేషన్ చేసుకొని మిగిలిన నలుగురికి స్థలం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇలా చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శులు చేతివాటం ప్రదర్శించడంతో గ్రామాల్లో సమస్యలు వస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లకు నంబర్లు..
గత సర్కార్ ఎల్ఆర్ఎస్ ను తీసుకురావడంతో కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోయాయి. వీటిలో చాలా ప్లాట్లకు పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అసెస్ మెంట్ నంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అక్కడ ఇంటి నంబర్లు ఉన్నా ఖాళీ స్థలాలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే విద్యా సంస్థల పేరుతో నంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు సమాచారం.
అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ చెల్లదు..
అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం నేరం. ఎవరైనా ఆ భూములు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చెల్లదు. ఇండ్లు కట్టుకున్నా కూలగొట్టడం ఖాయం. గతంలో అలంపూర్ చౌరస్తాలో షెటర్లను సైతం కూల్చి వేశాం. అలంపూర్ లోని అసైన్డ్ భూములపై ఎంక్వైరీ చేస్తాం. రాంచందర్, ఆర్డీవో, గద్వాల