
- గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కార్
- అకడమిక్ రికార్డ్, రీసెర్చ్‌కు 50% మార్కులు
- టీచింగ్ స్కిల్స్, విషయ పరిజ్ఞానానికి 30 మార్కులు
- ఇంటర్వ్యూలకు 20 మార్కులు కేటాయించిన ప్రభుత్వం
- త్వరలో పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అన్ని వర్సిటీలకు ఒకే రకమైన మార్గదర్శకాలు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీల్లోని ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు విధివిధానాలు తయారు చేయాలని అధికారులను గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
దీంతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నేతృత్వంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం గైడ్ లైన్స్ రూపొందించి, కౌన్సిల్‌కు అందించింది. వీటిని కౌన్సిల్ అధికారులు సర్కారుకు పంపించారు. కమిటీ సిఫార్సుల మేరకు మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని రిజర్వేషన్ల అమలుతో పాటు రోస్టర్ విధానాన్ని ఈ పోస్టుల భర్తీలో అమలు చేయాలని సర్కారు ఆదేశించింది.
వెయిటేజీ ఇలా..
అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి మూడు విధానాల్లో వెయిటేజీ మార్కులను కేటాయించనున్నట్టు సర్కారు తెలిపింది. ప్రధానంగా అకడమిక్ రికార్డ్, రీసెర్చ్ పర్ఫామెన్స్‌కు 50 శాతం మార్కులు అలాట్ చేశారు. ఇందులో డిగ్రీ మార్కులకు 8, పీజీ మార్కులకు 12 మార్కులను గరిష్టంగా కేటాయించారు. జేఆర్ఎఫ్, నెట్/సెట్, పీహెచ్‌డీ, ఎంఫిల్‌కు, రీసెర్చ్ పబ్లికేషన్లు, కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు మిగిలిన మార్కులకు అలాట్ చేశారు.
వీటిని పరిశీలించేందుకు వర్సిటీ వీసీతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నామిని (సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్), బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్‌మెంట్ హెడ్ కన్వీనర్‌గా ఉంటారు. టీచింగ్ స్కిల్స్, విషయ పరిజ్ఞానానికి 30 మార్కులు కేటాయించారు. ఇందులో టీచింగ్ ఎక్స్‌పీరియెన్స్‌కు గరిష్టంగా పది మార్కులు ఉన్నాయి. అయితే, ఒక్కో ఏడాదికి ఒక్కో మార్కు చొప్పున ఇవ్వనున్నారు. ప్రధానంగా కాంట్రాక్టు ఫ్యాకల్టీని దృష్టిలో పెట్టుకొని ఈ రూల్ తీసుకొచ్చారు.
సర్కారు కాలేజీలతో పాటు ప్రైవేటు కాలేజీల్లోని లెక్చరర్లకూ ఇది వర్తించనుంది. ఒక్కరే పుస్తకాన్ని రాస్తే ఐదు మార్కులు, జాయింట్‌గా రాస్తే మూడు మార్కులు, ఎడిటర్‌గా ఉంటే రెండు మార్కులు పొందొచ్చు. ఫెలోషిప్స్‌కు గరిష్టంగా ఐదు మార్కులు, డెమో లెక్చర్‌కు పది మార్కులు కేటాయించారు. వీటిని పరిశీలించేందుకుగాను ఫ్యాకల్టీ డీన్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ (కౌన్సిల్ నామిని), సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ (వీసీ నామిని)తో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది.
ఇంటర్వ్యూలకు 20 మార్కులు కేటాయించారు. సబ్జెక్ట్ ప్రజెంటేషన్, రీసెర్చ్ అప్టిట్యూడ్, ఓవరాల్ పర్సనాలిటీ, ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ఆధారంగా మార్కులు ఇవ్వనున్నారు. దీనికి వర్సిటీ వీసీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. కాగా, మొదటి దశలో అందరి మార్కులను పరిగణనలోకి తీసుకొని, 1:10 రేషియోలో రెండో దశకు ఎంపిక చేశారు. ఇందులో నుంచి 1:5 రేషియాలో ఇంటర్వ్యూలకు సెలెక్ట్ చేస్తారు.
ఎన్ని పోస్టులు..?
గత ప్రభుత్వ హయాంలో 1,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,817 టీచింగ్ పోస్టులు సాంక్షన్ ఉండగా, 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని పోస్టులను భర్తీ చేస్తుందనే దానిపై సస్పెన్స్ కొనసా గుతోంది. మరోపక్క జీవోలో కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో ఈ లెక్కన 1,524 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుంటే, దాంట్లో 1,061 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఓయూలో 470 పోస్టులు ఉన్నాయి.