ఖమ్మం ర్యాగింగ్‌‌‌‌ ఘటనపై ఎంక్వైరీకి కమిటీ

ఖమ్మం ర్యాగింగ్‌‌‌‌ ఘటనపై ఎంక్వైరీకి కమిటీ

ఖమ్మం, వెలుగు: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్టియర్​ స్టూడెంట్‌‌‌‌పై ర్యాగింగ్‌‌‌‌ ఘటన సంచలనంగా మారింది. స్టూడెంట్‌‌‌‌కు అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్ గుండు కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇప్పటికే కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరరావు ముగ్గురు డాక్టర్లతో ఇంటర్నల్ ఎంక్వైరీకి కమిటీని ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. యాంటీ ర్యాగింగ్‌‌‌‌ మెడికల్ ఆఫీసర్‌‌‌‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌‌ రెహ్మాన్‌‌‌‌.. స్టూడెంట్‌‌‌‌కు గుండు కొట్టించడంతో ఆయనను ఉద్యోగం నుంచి తప్పించారు. అంతర్గత విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ రాజేశ్వరరావు వెల్లడించారు.

అసలేం జరిగింది ?
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్‌‌‌‌‌‌‌‌లో చేరాడు. ఈ నెల 12న హాస్టల్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ అయ్యేందుకు రాగా, అక్కడే ఉన్న సీనియర్లకు అతని హెయిర్‌‌‌‌కట్‌‌‌‌ నచ్చలేదు. దీంతో కటింగ్‌‌‌‌ చేయించుకొని రావాలని కొందరు సెకండియర్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌ అతడిపై ఒత్తిడి చేశారు. దీంతో వారు చెప్పినట్లు ఆ స్టూడెంట్‌‌‌‌ బయటకెళ్లి హెయిర్‌‌‌‌ ట్రిమ్మింగ్‌‌‌‌ చేయించుకొని వచ్చాడు. అయినా కటింగ్ సరిగా లేదని సీనియర్లు గొడవ చేశారు. ఈ విషయం యాంటీ ర్యాగింగ్‌‌‌‌ మెడికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌‌ రెహ్మాన్‌‌‌‌కు తెలిసింది. ర్యాగింగ్ చేస్తున్న సెకండియర్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఫస్టియర్ స్టూడెంట్‌‌‌‌పైనే రెహ్మాన్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో జూనియర్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ను వెంటబెట్టుకొని సెలూన్‌‌‌‌కు తీసుకెళ్లి, గుండు కొట్టించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఈ నెల 13న ప్రిన్సిపల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రెహ్మాన్‌‌‌‌ను యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా తప్పించిన ప్రిన్సిపల్.. విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. శనివారం డీఎంఈకి విషయం తెలియడంతో విచారణ చేపట్టారు. ఆయన ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. స్టూడెంట్‌‌‌‌కు గుండు కొట్టిన విషయం బయటపడకుండా జిల్లాకు చెందిన ఓ పోలీస్‌‌‌‌ అధికారి కూడా ప్రయత్నించినట్లు తెలిసింది. తన బంధువైన అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ రెహ్మాన్‌‌‌‌ను కాపాడేందుకు సహకరించినట్లు సమాచారం. 

బాధిత స్టూడెంట్‌‌‌‌ రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వలేదు
ఫస్టియర్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌కు గుండు కొట్టించిన విషయం ఈ నెల 13న నా దృష్టికి వచ్చింది. బాధిత విద్యార్థి నాకు మౌఖికంగా కంప్లైంట్‌‌‌‌ చేశాడు. తర్వాత సీనియర్​విద్యార్థులతో కాంప్రమైజ్ అయ్యారు. బాధితుడు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌తో పాటు విద్యార్థులకు కూడా వార్నింగ్‌‌‌‌ ఇచ్చాను. యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఉండి ఇలా ఎందుకు చేశావని రెహ్మాన్‌‌‌‌ను ప్రశ్నించాను. ఉన్నతాధికారుల సూచన మేరకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం. వారిచ్చిన రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.


రాజేశ్వరరావు, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్