హైదరాబాద్, వెలుగు: వివిధ అంశాల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తామని పరిశ్రమల సంఘం అసోచామ్ ప్రకటించింది. సంస్థ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కౌన్సిల్ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సీఎండీ రవి కుమార్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిరత , సాధికారత, వ్యవస్థాపకత, డిజిటలైజేషన్ వంటి కీలక రంగాల్లో అసోచామ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని చెప్పారు. ఈ రాష్ట్రాలలో సామాజిక-ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాల వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి రంగాల వారీగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశామన్నారు.