- హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్: ‘‘దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలో ప్రతి విభాగంలో పని చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది.. ఇలాంటి సమయంలో వారి భద్రత చాలా ముఖ్యం.. దీనికోసం తెలంగాణ పోలీసులు చాలా కృషి చేస్తున్నారు.. అయినా మహిళల్లో అభద్రతాభావానికి స్థానం లేకుండా చేసేందుకు భరోసా కేంద్రాలు పనిచేస్తాయి..’’ అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు. దేశంలో అత్యంత భద్రత కలిగిన సిటీ హైదరాబాద్.. మహిళల పై అఘాయిత్యాల సంఖ్య చాలా తక్కువ.. మహిళలను వేధించేవారికి షీ టీమ్స్ ద్వారా కేసులు పెట్టించడంతో పాటు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. పాత బస్తి మీర్ చౌక్ లో నూతనంగా నిర్మించనున్న భరోసా సెంటర్ కు హోం శాఖ మంత్రి మహమూద్ అలి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీపీ జనీకుమార్ మాట్లాడుతూ.. బాలికలు, మహిళల్లో అభద్రతాభావానికి ఆస్కారం లేకుండా చేయాలన్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, పోలీస్ హౌసింగ్ బోర్డ్ కొలేటి దామోదర్, సౌత్ జోన్ డీసీపీ భూపాల్, అదనపు డీజీలు, జాయింట్ సిపిలు తదితరులు పాల్గొన్నారు.