
- నార్మల్ డెలివరీలు పెంచేలా యాదాద్రి కలెక్టర్ స్పెషల్ ప్రోగ్రాం
- జిల్లాలో 291 మంది గర్భిణులు గుర్తింపు
- ఒక్కో గర్భిణి ఇంటికి ఒక్కో ఆఫీసర్ వెళ్లి న్యూట్రిషన్ కిట్ అందజేత
- ఆపరేషన్ వల్ల కలిగే నష్టాలను వివరించి, సర్కార్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచన
యాదాద్రి, వెలుగు : గర్భిణుల ఆరోగ్య రక్షణకు యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు స్పెషల్ ప్రోగ్రాం చేపట్టారు. వారికి భరోసా ఇవ్వడంతో పాటు నార్మల్ డెలివరీలపై అవగాహన కల్పించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ప్రతి గర్భిణి ఇంటికి ఒక్కో ఆఫీసర్‌ను పంపించి ఆపరేషన్ వల్లే కలిగే నష్టాలను వివరించడంతో పాటు న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తున్నారు.
ఎక్కువ మంది ప్రైవేట్‌కు వెళ్తుండడంతో...
గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో నాణ్యమైన ట్రీట్‌మెంట్ అందించే లక్ష్యంతో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు ఇటీవల రివ్యూ నిర్వహించారు. ఇందులో గర్భిణులు ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్స్‌కే వెళ్తున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. ఎక్కువ డెలివరీలు ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే జరుగుతున్నాయని, ఇందులో ఆపరేషన్లే ఎక్కువగా ఉంటున్నాయని, పైగా శిశు మరణాలు సంభవిస్తున్నాయని తేలింది.
దీంతో గర్భిణుల ఆరోగ్యంపై స్పెషల్ కేర్ తీసుకోవడంతో పాటు నార్మల్ డెలివరీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని హెల్త్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31లోగా డెలివరీ అయ్యే అవకాశం ఉన్న గర్భిణులను గుర్తించాలని సూచించారు. దీంతో ఆఫీసర్లు జిల్లా వ్యాప్తంగా 300 మంది గర్భిణులను గుర్తించారు. వీరిలో ఎక్కువ మందిలో ఐరన్ శాతం, బరువు తక్కువగా ఉండడం, బీపీ, డయాబెటీస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ లిస్ట్‌ను పరిశీలించిన కలెక్టర్ గర్భిణులకు భరోసా పేరుతో స్పెషల్ ప్రోగ్రాం రూపొందించి ఆఫీసర్లను రంగంలోకి దించారు.
ఒక్కో గర్భిణికి బాదం, పల్లి, ఖర్చూరా
డెలివరీ టైం దగ్గర పడిన గర్భిణుల ఇండ్లకు ఆఫీసర్లు వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. హైరిస్క్‌లో ఉన్న గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్ శాతం పెంచుకునేందుకు అవసరమైన సూచనలు ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ స్వయంగా గుండాల మండలం అనంతారంలోని గర్భిణి ఇంటికి వెళ్లగా, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్ యాదగిరిగుట్ట, భువనగిరిలోని గర్భిణుల ఇండ్లకు వెళ్లారు.
సోమవారం ఒక్కరోజే పలువురు ఆఫీసర్లు జిల్లాలోని 291 మంది గర్భిణులను కలిసి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఏ హాస్పిటల్‌కు వెళ్తున్నారు ? ట్రీట్‌మెంట్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు ? అనే విషయాలను తెలుసుకున్నారు. ప్రైవేట్‌కు వెళ్తే ఆర్థికంగా భారం పడడంతో పాటు అవసరం లేకున్నా ఆపరేషన్ చేస్తారని గర్భిణులకు వివరించారు. అనంతరం గర్భిణులుక బాదం, పల్లి పట్టీ, ఖర్జూరాతో పాటు చిరుధాన్యాలతో చేసిన లడ్డూల కిట్‌ను అందించారు.
అపర్ణ ఎలా ఉన్నావ్? : గర్భిణితో కలెక్టర్ మాటామంతీ
యాదాద్రి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల అపర్ణకు ఇద్దరు అమ్మాయిలు కాగా మూడోసారి గర్భం దాల్చింది. సోమవారం యాదాద్రి కలెక్టర్ హనుమతరావు అపర్ణ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. టైం ప్రకారం భోజనం చేస్తున్నారా ? మందులు వేసుకుంటున్నారా ? అంటూ పలకరించారు. మంచి ఆహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని వివరించారు.
ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీయగా.. తన భర్త కారు డ్రైవర్‌గా, అత్త నర్సమ్మ గ్రామ పంచాయతీలో స్వీపర్‌గా చేస్తున్నారని అపర్ణ చెప్పింది. అనంతరం అపర్ణకు కలెక్టర్ న్యూట్రిషన్ కిట్‌ను అందజేశారు. తాను గవర్నమెంట్ హాస్పిటల్‌కే వెళ్తున్నానని, మంచిగానే చూసుకుంటున్నారని చెప్పడంతో ఆమెను కలెక్టర్ అభినందించారు.