సూర్యాపేట/యాదాద్రి/మేళ్లచెరువు, వెలుగు: అకా ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని సూర్యాపేట, యాదాద్రి కలెక్టర్లు, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్లు రైతులకు భరోసా కల్పించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలంలోని వేల్పుచర్ల గ్రామంలో దెబ్బతిన్న వర్రే సాయమ్మ వరి పొలాన్ని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురిసిన వడగళ్ల వానకు పాడైన పంటల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. పంట నష్టపరిహారం అందజేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, మండల ఏఓ శశిధర్ రెడ్డి ఉన్నారు.
ఎక్కువ నష్టం జరిగితేనే రికార్డ్
యాదాద్రి జిల్లాలో 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగిన పంటల వివరాలు సేకరించాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వడగండ్ల వానతో జరిగిన పంట నష్టంపై అగ్రికల్చర్ ఆఫీసర్లు, స్టాఫ్‌తో మంగళవారం ఆమె కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. గత నెల 23 నుంచి ఈనెల 24 వరకు కురిసిన వానల కారణంగా 10,450 ఎకరాల్లో పంట నష్టపోయిందని అగ్రికల్చర్ స్టాఫ్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం రికార్డు చేయాలని సూచించారు. 33 శాతం కంటే ఎక్కువగా పంట నష్టపోయిన రైతుల వివరాలు, భూముల సర్వే నంబర్ల వారీగా రికార్డు చేసి 29లోగా అందించాలని ఆదేశించారు. మీటింగ్‌లో డీఏవో కే అనురాధ, హార్టికల్చర్ ఆఫీసర్ అన్నపూర్ణ, మార్కటింగ్ ఆఫీసర్ సబిత, మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెకర్ల పరిశీలన..
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో దెబ్బతిన్న పంటలను అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. రైతులు నష్టపోయిన పంట వివరాలను మండల స్థాయి అధికారులు నివేదికలను వెంటనే జిల్లా కేంద్రానికి అందజేయాలని ఆయన సూచించారు. పంటనష్ట పోయిన కౌలు రైతుల పేర్లు కూడా అందజేయాలని చెప్పారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ, మేళ్లచెరువు, హేమ్లాతండాలోని కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు పరిశీలించారు. హేమ్లాతండాలో ఓటీపీ సమస్య ఉండటంతో అగ్రికల్చరల్ ఆఫీసర్లతో చర్చించి సమస్యను పరిష్కరించారు. తడిసిన వడ్లను పరిశీలించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మొత్తం కొనుగోలు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.బాధిత రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.