విశ్లేషణ: అటవీ హక్కుల చట్టంతోనే ఆదివాసీలకు భరోసా

ఆదివాసీలు, గిరిజనులకు అడవి అమ్మలాంటిది. వారిని కంటికి రెప్పలా కాపాడుకునేది అడవే. వారి బతుకుదెరువు మొత్తం అడవిపైనే ఆధారపడి ఉంది. అటవీ వనరులను వాడుకుంటూ, పోడు భూములను దున్నుకుంటూ బతికేవారే ఎక్కువ. వీరి హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిందే అటవీ హక్కుల చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే ప్రజాస్వామిక విలువలను పాటించడమే. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తేనే ఆదివాసీలు, గిరిజనేతరుల హక్కులను రక్షించగలుగుతాం. అడవుల పరిరక్షణకు, ఆదివాసీల హక్కులకు మధ్య తలెత్తే వివాదాలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపించగలుగుతాం.

అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు కలిసికట్టుగా చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అటవీహక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు రైతుల సమస్యలకు పరిష్కారం వెతుకుతామని ప్రకటించింది. ఇది ఆహ్వానించ దగిన పరిణామం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు బాధ్యతను పూర్తిగా అటవీ శాఖకు అప్పగించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు శాటిలైట్ ఫొటోల్లో 2005కు ముందు పోడు భూములు దున్నుకున్నట్టు సాక్ష్యం కనబడకపోతే క్లైమ్ ఫారాలను తిరస్కరించే ప్రమాదం కనబడుతోంది. ఈ ప్రమాదం నుంచి పోడు రైతులు రక్షణ పొందాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అర్థం చేసుకోవాలి.

హక్కును కోల్పోయిన ఆదివాసీలు
అడవులను చట్టబద్ధంగా గుర్తించి, ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీలకు, ఆడవుల్లో నివసించే ఇతర సమూహాలకు జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికే అటవీ హక్కుల చట్టం వచ్చింది. బ్రిటిష్ పాలకులు అడవులను హస్తగతం చేసుకున్న నాటికే.. అడవుల్లో ఆదివాసీలు, గిరిజనేతరులు నివసిస్తున్నారు. అటవీ వనరులను వీరంతా ఉపయోగించుకునే వారు. దానికి తోడు అడవుల్లోనే పోడు చేసుకొని బతుకుదెరువు పొందేవారు. అడవి వారికి ఇల్లు, జీవిక. ఎప్పుడైతే ఈ అడవుల చుట్టూ గీత గీసి వాటిని తమ సొంత ఆస్తిగా బ్రిటిష్ పాలకులు, స్థానిక సంస్థానాధీశులు ప్రకటించారో.. అక్కడ నివసించే ఆదివాసీలు, గిరిజనేతరులు అప్పటి వరకు తాము అనుభవించిన వనరులపై కలిగి ఉన్న సంప్రదాయక హక్కులను కోల్పోయారు.

హక్కులను కాపాడేందుకే కుమ్రం భీం పోరాటం
ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీల హక్కులను కాపాడటం కోసమే కుమ్రం భీం పోరాటం చేశారు. 1940 దశకంలో నిజాం ప్రభుత్వం అడవుల సంరక్షణ పేరుతో చట్టం ప్రకారం అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. అందువల్ల అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనేతరులు ఆక్రమణదారులుగా మారిపోయారు. అడవుల్లో దున్నుకోవటానికి గాని, అటవీ ఉత్పత్తులను అనుభవించడానికి గాని వారికి అవకాశం లేకుండా పోయింది. అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు, ఉపయోగించినందుకు వారిపై అటవీ శాఖ శిక్షలు వేయడం ప్రారంభించింది. అలా అడవులను తమ ఇల్లుగా భావించిన ఆదివాసీలు, గిరిజనేతరులను రాష్ట్ర ప్రభుత్వం చొరబాటుదారులుగా చూడటం మొదలైంది. దాని ఫలితంగా ఆదివాసీలు తమ బతుకుదెరువు కోల్పోయారు. తమ హక్కుల సాధన కోసం కుమ్రం భీం నేతృత్వంలో పోరాడారు. అప్పటి నుంచి ఆదివాసీలు పోయిన తమ హక్కుల సాధన కోసం ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. 

ఇది భూమి పంపిణీ చట్టం కాదు
చివరికి 2004లో అధికారంలోకి వచ్చిన మన్మోహన్​సింగ్​ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సంప్రదాయకంగా ఆదివాసీలు అనుభవిస్తున్న హక్కులను గుర్తించడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో వచ్చిందే అటవీ హక్కుల చట్టం. ఇది భూమి పంపిణీ కోసం ఏర్పడిన చట్టం కాదు. ఆదివాసీల, ఇతర అటవీ సమూహాల సంప్రదాయక హక్కుల పరిరక్షణ కోసం వచ్చింది. ఆ హక్కులను గుర్తించడానికి కూడా ఇది వరకటి చట్టాల మాదిరిగా కాకుండా చాలా వినూత్నమైన పద్ధతులను తీసుకొచ్చింది. హక్కుల గుర్తింపు ప్రక్రియలో ప్రజలకు విస్తృత భాగస్వామ్యం కల్పించింది. ఇవన్నీ అర్థమైతే తప్ప ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదని గమనించాలి. అందుకే ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

అనుభవిస్తున్న భూమికి పట్టాలు
ఈ చట్టం మిగతా భూమి పంపిణీ చట్టాలు, ఉత్తర్వుల కన్నా భిన్న మైనది. ఆ చట్టాల ప్రకారం ప్రభుత్వ మిగులు భూమి ఉంటే, అధికారులు సర్వే చేసి అలాంటి భూమిని పంపిణీ చేయవచ్చు. భూమి పంపిణీకి ఒక గరిష్ట పరిమితి ఉన్నది. అంతకు మించి ఇవ్వరాదు. ఈ చట్టాలతో పోలిస్తే అటవీ హక్కుల చట్టానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం భూమిని పంచదు. అడవుల్లో ఆదివాసీలు, గిరిజనేతరులు అనుభవిస్తున్న హక్కులను గుర్తిస్తుంది. 10 ఎకరాల లోపు ఎంత భూమి అనుభవిస్తే అంత భూమికి పట్టా ఇవ్వాలి. పోడు రైతుల యాజమాన్యపు హక్కులను నిర్ధారించేది గ్రామ సభ ద్వారా ప్రజలేనని తెలుసుకోవాలి. దరఖాస్తులు తీసుకునేది, క్లెయిములను పరిశీలించేది గ్రామ సభ నియమించిన అటవీ హక్కుల కమిటీ అని గుర్తు పెట్టుకోవాలి.

రాజకీయ జోక్యం తగదు
చట్టం అమలులో ఎమ్మెల్యేలకు పాత్ర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజలకు, పోడు రైతులకు నష్టం చేసే విషయం. గ్రామసభ పనిలో కానీ, క్లెయిమ్ ఫారాల పైన నిర్ణయాల్లో కానీ రాజకీయ జోక్యం ఉండరాదు. సబ్-డివిజన్, జిల్లా కమిటీల నిర్మాణం జరగాలి. అన్ని నిర్ణయాలు కమిటీల్లోనే తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో మానిటరింగ్ కమిటీ ఏర్పడాలి. ఈ కమిటీ అటవీ హక్కుల చట్టం అమలును పర్యవేక్షించాలి. గిరిజన సంక్షేమ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించాలి. అన్ని శాఖల మధ్య సమన్వయం చేసే బాధ్యత గిరిజన సంక్షేమ శాఖకు ఇవ్వాలి. కనీసం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చట్టం అమలు కావడం కష్టంగా మారుతుంది.

చట్టాన్ని అర్థం చేసుకోవాలె
అటవీ హక్కుల చట్టం అమలు చేయాలంటే ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకొని పాటించడం చాలా అవసరం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చట్టం అమలులో మార్గదర్శిగా, గ్రామసభ ద్వారా తన పాత్రను పోషించాలి. ప్రజల నిర్ణయ శక్తిపైన గౌరవం లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం చట్టాన్ని అర్థం చేసుకొని అమలు చేయలేదు. అవినీతికి తావివ్వకుండా, రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తేనే అడవులను కాపాడవచ్చు. ఆదివాసీల, గిరిజనేతరుల హక్కులను రక్షించవచ్చు. అడవుల పరిరక్షణకు, ఆదివాసీల హక్కులకు మధ్య తలెత్తే వైరుధ్యాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించవచ్చు. చివరగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అటవీ హక్కుల చట్టాన్ని  అమలుచేయడమంటే ప్రజాస్వామిక విలువలను పాటించడమే. ఈ స్పృహతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ప్రతి పౌరుడు కోరుకోవాలి. అలా వ్యవహరించేటట్టు ప్రతి ప్రజాస్వామికవాది తమ వంతు ప్రయత్నం చేయాలి.

గ్రామ సభకే సకల అధికారాలు
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసే అధికారం గ్రామ సభకే ఉన్నదని ప్రభుత్వం గుర్తించాలి. గ్రామ సభ తన తరఫున తాను నిర్వర్తించ వలసిన పనులను చేయడానికి అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. అటవీ హక్కుల కమిటీ సాక్ష్యాలను పరిశీలిస్తుంది. భూమి సరిహద్దులను రెవెన్యూ, అటవీ శాఖలతో కలిసి నిర్ధారిస్తుంది. అటవీ హక్కుల కమిటీ నివేదికపై తుది నిర్ణయం గ్రామ సభదే. గ్రామ సభను పని చేయనివ్వక పోతే చట్టం అమలులో అటవీ శాఖ పెత్తనం మాత్రమే కొనసాగుతుంది.

శాటిలైట్​ ఫొటోలు ప్రామాణికం కాదు
భూమిని అనుభవిస్తున్నట్టు సాక్ష్యంగా పూర్తిగా శాటిలైట్ ఫొటోల మీద మాత్రమే ఆధారపడటానికి వీలు లేదు. చట్టానికి సంబంధించిన నియమాల్లో 14 రకాల సాక్ష్యాలను పేర్కొన్నారు. అందులో ఏ  రెండు ఉన్నా చాలునని నియమాలు చెపుతున్నాయి. నిజానికి శాటిలైట్ ఫొటోలను ప్రామాణికంగా తీసుకోరాదని గతంలో గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది.
- ఎం.కోదండరామ్, టీజేఎస్ అధ్యక్షుడు