యాసంగి పంటకు నీళ్లిస్తాం.. రైతాంగానికి ఆఫీసర్ల భరోసా

యాసంగి పంటకు నీళ్లిస్తాం.. రైతాంగానికి ఆఫీసర్ల భరోసా
  • 2.50 లక్షల ఎకరాలకు మార్చి వరకు సాగు నీరు అందించాలని నిర్ణయం
  • శ్రీశైలంలో నీటి లభ్యత ఆధారంగా సప్లై చేస్తామని ప్రకటన

నాగర్​కర్నూల్, వెలుగు: యాసంగి సాగు చేసే రైతులకు ఇరిగేషన్​ అధికారులు భరోసా ఇచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల స్కీం పరిధిలోని నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, వనపర్తి జిల్లాలో యాసంగి సాగు చేసే 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది యాసంగి సాగుకు సాగు నీటి కొరత ఏర్పడడంతో, ఈసారి యాసంగికి సాగు నీరిస్తారా? లేదా? అన్న చర్చకు ఇరిగేషన్​ అధికారులు తెరదించారు. 

శ్రీశైలం రిజర్వాయర్​లో నీటి లభ్యతను బట్టి మార్చి వరకు సాగునీటిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని కేఎల్ఐ సర్కిల్​- ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇటీవల ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎత్తిపోతల పథకాల కింద యాసంగి సాగుకు నీరివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి 29వ ప్యాకేజీలోని చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

నాగర్ కర్నూల్​ జిల్లాలో 3.10 లక్షల ఎకరాలు..

యాసంగి సీజన్​లో నాగర్​ కర్నూల్​ జిల్లాలో 3.10 లక్షల ఎకరాలు సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.1.46 లక్షల ఎకరాల్లో వరి,1.25 లక్షల ఎకరాల్లో వేరుశనగ,20 వేల ఎకరాలలో మొక్కజొన్న,16 వేల ఎకరాల్లో కందులు, జొన్న, ఆముదాలు, 4 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారు. కేఎల్ఐ పరిధిలో మూడు ప్యాకేజీల కింద 1.50లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన లక్ష ఎకరాలు బోర్లు, చెరువుల కింద సాగు చేస్తారు. 

Also Read :- పక్కా ఇండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్

మహబూబ్​నగర్​ జిల్లాలోని మిడ్జిల్​ మండలం, వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, గోపాల్​పేట, చిన్నంబావి మండలాల పరిధిలోని భూములకు సాగు నీరు అందించాల్సి ఉంటుంది. మెయిన్​ కెనాల్స్, బ్రాంచ్, సబ్, మైనర్​ కాల్వల రిపేర్లు, నిర్వహణ తదితర అంశాలు పక్కకు పెడితే ముందు ఈ యాసంగి పంట చివరి తడుల వరకు నీరిస్తే చాలనుకుంటున్నారు. 

భారమంతా శ్రీశైలంపైనే..

శ్రీశైలం రిజర్వాయర్​లో నీటి లభ్యతను బట్టి యాసంగి సాగుకు మార్చి చివరి వరకు నీరిస్తామన్న ఇరిగేషన్​ అధికారులు ప్రకటించారు. అయితే డిసెంబర్​ మూడవ వారంలోనే శ్రీశైలం నీటి నిల్వ 115 టీఎంసీలకు చేరింది. ఏపీ, తెలంగాణ వైపు ఉన్న ఇరిగేషన్​ ప్రాజెక్టులకు నీటిని వదులుతున్నారు. యాసంగి నారుమళ్లకు ఇంకా టైం ఉన్నా పంట చేతికి వచ్చే చివరి నెలలు మార్చి, ఏప్రిల్​ నెలలు కీలకమైనవి. ఆ సమయంలో ఎండల తీవ్రత కారణంగా వరికి నీరు, వేరుశనగ, ఇతర పంటల తడులకు నీళ్లు అవసరమవుతాయి. 

శ్రీశైలం రిజర్వాయర్​లో మూడు రోజులకు ఒక టీఎంసీ చొప్పున నీటిని వాడుకుంటున్నారు. విద్యుత్​ ఉత్పత్తి, భగీరథ స్కీంతో పాటు ఏపీ వైపు పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, ఎస్ఆర్బీసీ​ ప్రాజెక్టులకు, తెలంగాణ వైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటిని లిఫ్ట్​ చేస్తున్నారు. కేఎల్ఐ కింద నాలుగు వేల క్యూసెక్కులు డ్రా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 800 క్యూసెక్కులు మాత్రమే ఎత్తిపోస్తున్నారు. మూడు ప్రధాన రిజర్వాయర్లు,700 చెరువులు పూర్తిగా నింపితేనే యాసంగి సాగుకు పూర్తి స్థాయిలో నీరందుతుందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు.