మార్చిలో భూమి దగ్గరగా ఆస్టరాయిడ్‌‌ ..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కన్‌‌స్ట్రక్షన్.. దుబాయ్‌‌లోని బుర్జ్ ఖలీఫా టవర్స్. దీని హైట్ 828 మీటర్లు. నేల మీద నిలబడి చూస్తే ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్‌‌ కంటే రెండింతలు పైగా పొడవున్న ఆస్టరాయిడ్‌‌ వచ్చే నెలలో భూమికి దగ్గరగా పాస్ కాబోతోంది. ఈ అతి పెద్ద గ్రహ శకలం కారణంగా ఇప్పటికిప్పుడు భూమికి గానీ, ఇక్కడ బతుకుతున్న మనకి గానీ ఎటువంటి ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో దీని వల్ల  ముప్పు ఉంటుందేమోనని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

బుర్జ్ ఖలీఫా కంటే రెండింతల సైజు.. 1.7 కిలో మీటర్ల పొడవు ఉన్న ఆస్టరాయిడ్‌‌ మార్చిలో భూమికి ‘దగ్గర’గా రాబోతోందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పేరు ఆస్టరాయిడ్‌‌ 231937 (2001 FO32) అని తెలిపారు. ఇది ఇప్పుడు భూమిని ఢీ కొట్టే అవకాశం లేదు. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదు. ఈ ఆస్టరాయిడ్‌‌ భూమికి 19.3 లక్షల కిలోమీటర్ల దూరంలో తన ఆర్బిట్​లో దూసుకెళ్లబోతోంది. ఇది భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే ఐదింతలు ఎక్కువ. అయినప్పటికీ ఈ ఆస్టరాయిడ్‌‌ను పొటెన్షియల్లీ హజార్డస్ (ప్రమాదకరమైనది) అని నాసా పేర్కొంది. 15 కోట్ల కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న స్పేస్ రాక్స్, ఆస్టరాయిడ్స్ వల్ల భూమికి ఏదో ఒక రోజు రిస్క్ తప్పదని అంచనా కారణంగానే ఈ ఆస్టరాయిడ్‌‌ను కూడా పొటెన్షియల్లీ హజార్డస్ కేటగిరీలో చేర్చారు.

2001లో గుర్తించిన సైంటిస్టులు

ఈ ఆస్టరాయిడ్‌‌ను తొలిసారి 2001లోనే గుర్తించారు. స్పేస్‌‌లో తిరుగుతున్న గ్రహ శకలాలను కనిపెట్టడం కోసం న్యూ మెక్సికోలో లింకన్ నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్‌‌ రీసెర్చ్ (లీనియర్) ప్రోగ్రామ్ పేరుతో భారీ సంఖ్యలో టెలిస్కోప్‌‌లు ఏర్పాటు చేసింది నాసా. అమెరికా ఎయిర్‌‌‌‌ఫోర్స్, నాసా, ఎంఐటీ కలిసి ఈ ప్రాజెక్ట్‌‌ను స్టార్ట్ చేశాయి. 2001 మార్చి 23న ఈ భారీ ఆస్టరాయిడ్‌‌ను శాస్త్రవేత్తలు డిటెక్ట్‌‌ చేశారు.  దీనికి 2001 FO32 అని పేరు పెట్టారు. నాటి నుంచి దీనిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈ గ్రహ శకలం దాని కక్ష్యలో గంటకు 1,23,920 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. దీని స్పీడ్ ఆధారంగా దాని ఆర్బిట్‌‌ భూమికి అత్యంత దగ్గర ఉండే ప్లేస్, టైమ్‌‌ను శాస్త్రవేత్తలు లెక్కగట్టారు.

2185వ సంవత్సరం వరకు నో రిస్క్

స్పేస్‌‌లో ఉన్న ఆస్టరాయిడ్‌‌లో ఇదే అతి పెద్దదేమీ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కన్నా పెద్దవి కూడా ఉన్నాయట. అయితే దీనితో పోలిస్తే స్పేస్‌‌లో ఉన్న గ్రహ శకలాల్లో 97 శాతం ఆస్ట్‌‌రాయిడ్స్ చిన్నవే. భూమిని తాకే ప్రమాదం ఉన్న ప్రతి ఆస్టరాయిడ్‌‌నూ నాసా నిరంతరం అబ్జర్వ్ చేస్తూనే ఉంది. భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న  అన్ని ఆస్టరాయిడ్స్​ను హజార్డస్ అని నాసా క్లాసిఫై చేసింది. ప్రస్తుతం భూమికి దగ్గరగా వస్తున్న ఈ ఆస్టరాయిడ్‌‌తో కూడా ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తేల్చారు. 2185లోపు ఏ ఒక్క గ్రహ శకలం కూడా భూమిని ఢీకొట్టే చాన్స్ లేదని అంచనా వేశారు. భూమిని ఢీకొట్టేందుకు వచ్చే ఆస్టరాయిడ్స్ నుంచి మనం సేఫ్‌‌గా బయటపడేందుకు అవసరమైన టెక్నాలజీని ఆలోపు డెవలప్ చేయొచ్చని నాసా చెబుతోంది. ఒక స్పేస్‌‌క్రాఫ్ట్‌‌ను అంతరిక్షంలోకి పంపి భూమికి క్లోజ్‌‌గా వచ్చే ఆస్టరాయిడ్స్‌‌ను ఆ స్పేస్‌‌క్రాఫ్ట్ గ్రావిటీ ద్వారా దూరంగా మరో కక్ష్యలోకి లాగేయొచ్చని, దీనికి అవసరమైన ప్రయోగాలు చేస్తున్నామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

మార్చి 21న టెలిస్కోప్‌‌తో చూడొచ్చు!

ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడమైన బుర్జ్ ఖలీఫాకు రెండింతలు ఉన్న ఈ గ్రహ శకలం దాని కక్ష్యలో తిరుగుతూ మార్చి 21న భూమికి దగ్గరగా రాబోతోంది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత యూరప్‌‌లోని కొన్ని దేశాల్లో చూసే వీలుంటుంది. 8 అంగుళాల వెడల్పు ఉండే టెలిస్కోప్‌‌ ఉంటే దీనిని చూడొచ్చు. ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత ఇది భూమికి 19.3 లక్షల కిలోమీటర్ల దూరంలో ట్రావెల్ చేస్తుంది. అయితే మన దేశంలో ఉన్న వాళ్లు దీన్ని చూడలేరు. భూమికి దక్షిణార్ధ భాగంలో ఉండే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేసియా, మాల్దీవ్స్, చిలీ, అర్జెంటినా, పెరూ, బ్రెజిల్, ఈక్వెడార్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, మారిషస్, కాంగో, కెన్యా సహా మరికొన్ని దేశాల్లోని వాళ్లు మాత్రమే చూడగలుగుతారు. ఇండియా, చైనా, రష్యా, అమెరికా సహా నార్తర్న్​ హెమీస్పియర్‌‌‌‌లో ఉన్న దేశాల్లోని వాళ్లు ఈ ఆస్టరాయిడ్​ను చూడలేరు.