నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..

కోవిషీల్డ్, వాక్స్‌జెవ్రియా బ్రాండ్ పేర్లతో భారత్ సహా ప్రపంచ దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ విక్రయించిన దిగ్గజ ఫార్మాసూటికల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. తమ వాక్సిన్స్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఒప్పుకుంది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ సహకారంతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్  కొన్ని సందర్భాల్లో అరుదైన దుష్ప్రభావానికి దారితీయవచ్చని మొదటిసారిగా యూకే హైకోర్టులో అంగీకరించింది. 

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉన్నాయని ఆరోపిస్తూ అనేక కుటుంబాలు కోర్టులో ఫిర్యాదులు చేశాయి. వాక్సిన్ తీసుకున్న అనంతరం రక్తం గడ్డకట్టడంతో పని చేయలేకపోతున్నానని  జామీ స్కాట్ అనే వ్యక్తి ఆస్ట్రాజెనెకాపై చట్టపరమైన చర్య తీసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాడు.

 ఏప్రిల్ 2021లో వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత తన మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం ఏర్పడిందని, దాని ఫలితంగా శాశ్వత మెదడు గాయం ఏర్పడిందని ఇద్దరు పిల్లల తండ్రి అయిన జామీ స్కాట్ కోర్టుకు ఫిర్యాదు చేశాడు. ఇతని కేసులో  తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ (థ్రోంబోసైటోపెనియా)తో పాటు రక్తం గడ్డకట్టడం (థ్రాంబోసిస్) అనే అరుదైన సిడ్రోమ్ కారణంగా మెదడు, ఉదరంతో సహా శరీరంలోని వివిధ భాగాలలో తీవ్ర ప్రభావం చూపిందని గుర్తించారు.

స్కాట్ భార్య కేట్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ప్రేరిత రోగనిరోధక థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ (VITT) వ్యాక్సిన్ వల్ల సంభవించినట్లు వైద్య ప్రపంచం గుర్తించిందని చెప్పింది. దీనిపై ఆస్ట్రాజెనెకా క్షమాపణలు చెప్పాలని, బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

యూకే హైకోర్టుకు సమర్పించిన చట్టపరమైన పత్రాలలో.. టీకా "చాలా అరుదైన సందర్భాల్లో TTSకి కారణమవుతుంది" అని ఆస్ట్రాజెనెకా అంగీకరించింది.  థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రోంబోసిస్ అని పిలువబడే అరుదైన దుష్ప్రభావం సంభవిస్తుందని.. ప్రతి వ్యక్తి కేసులో కారణాన్ని గుర్తించడానికి నిపుణుల సాక్ష్యం అవసరమని ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఈ ప్రకటన ప్రజలల్లో ఆందోళనను రేకెత్తించడంతోపాటు వ్యాక్సిన్ భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తింది.  

కాగా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను పూణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) భారతదేశంలో తయారు చేసింది. భారతదేశంలో 1,749,417,978 డోస్‌ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందించింది.