ఆదాయం : 14
వ్యయం : 14
రాజపూజ్యం : 6
అవమానం : 1
ధనిష్ఠ 3, 4 పాదములు; శతభిషం 1, 2, 3, 4 పాదములు; పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం గూ, గే, గో, సా, సీ, సు, సే, సో, దా
గురువు 9.4.2024 నుండి 1.5.2024 వరకు మేషరాశి యందు తదుపరి 29.3.2025 ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 మరల ఉగాది వరకు జన్మరాశిలో లోహమూర్తిగా, రాహుకేతువులు తామ్రమూర్తులుగా సంచారం.
ఈ రాశి వాళ్లు ఆనందంగా ఉంటారు. రైతులకు సామాన్యం. ముహూర్తబలంతో వ్యవసాయ పనులు చేయగలిగితే నష్టం రాదు. వృత్తి, ఉద్యోగులకు శ్రమ అధికం. లాయర్లు, డాక్టర్లకు అనుకూలం. కాంట్రాక్టర్లు టెండర్లు జాగ్రత్తగా వేయగలిగితే ధనార్జన ఉంటుంది. సరస్వతీ ద్వాదశ నామాలు చదివిన విద్యార్ధులకు మంచి మార్కులు వచ్చును. రాజకీయ నాయకులకు అనేక సమస్యలు.
సినిమా రంగంలోని వారికి సమస్యలు అధికం. షేర్స్ వాళ్లకి కష్టకాలం. బిగ్ ఇండస్ట్రీకి అనుకూలం. స్మాల్ ఇండస్ట్రీ వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్స్య పరిశ్రమకు ప్రాముఖ్యత ఉండదు. పౌల్ట్రీ వారికి సామాన్య లాభాలు. నిరాశ నిస్పృహ ఉంటుంది. ప్రతి రంగం వాళ్లకి బాగా ఉన్నట్లుగా ఉంటుంది. ఆదాయం విషయంలో అర్థం కాదు. ప్రతి విషయం ఒక సమస్యలా ఉంటుంది. అలాగని భయపడనవసరం లేదు. అన్నిటికీ కాలమే జవాబు చెప్తుంది. విశ్వాసంతో ముందుకు సాగాలి. గౌరవం ఉంటుంది. ఆదాయం ఖర్చులకు సరిపోదు.
అలాగని భయపడొద్దు. శని ప్రభావంతో అనవసర ఖర్చులు, అనారోగ్య సూచనలు. శని బాధా నివారణ పూజలు, జపాలు చేసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. నిరంతరం శని బాధించుట వలన మీరు మహన్యాస పూర్వక రుద్రాబిషేకం, శివనామ స్మరణ చేస్తే భయములు తొలగిపోగలవు. నూతనంగా అభివృద్ధి కొరకు ఏవిధమైన ఆలోచన చేయరాదు. మీరు ఏది ప్రారంభించినా మధ్యలో ఆగిపోయే అవకాశములు ఎక్కువ. ధనిష్ఠ నక్షత్రం వాళ్లు పగడం ధరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయండి. శతభిషం నక్షత్రం వాళ్లు గోమేదికం ధరించండి.
దుర్గాదేవికి అష్టోత్తర శతనామములు కుంకుమ పూజలు చేయండి. పూర్వాభాద్ర నక్షత్రం వాళ్లు కనకపుష్యరాగం ధరించండి. గురు బలం కొరకు శ్రీ సాయినాథునికి శెనగ గుగ్గిళ్ల ప్రసాదములు. దక్షిణామూర్తి పూజలు చేయాలి. ప్రతి విషయంలో అనుకూలంగా ఉండాలంటే తక్కువగా మాట్లాడాలి. తల్లిదండ్రుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. కంప్యూటర్ రంగం వాళ్లు శని ప్రభావమును ఉపయోగించుకుంటే ప్రమోషన్ వస్తుంది. ఎవరిని నమ్మినా మోసం జరిగే అవకాశాలు ఉన్నవి. ఏకాగ్రత కలిగి పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేసి ఫలితాలు పొందగలరు. మీకు మీరే సాటి అని నిరూపించుకొనగలరు. అదృష్టసంఖ్య 8.
చైత్రం : చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సమస్యల్లో చిక్కుకుంటారు. మేథాశక్తికి పదును పెట్టండి. చాలా హుందాగా ఉండండి. ఇతరులకు మానసికంగా కుంగిపోయినట్లు తెలియరాదు. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు శక్తిని నింపగలవు.
వైశాఖం : సామాన్యంగా ఉంటుంది. అందరితో అనుకూలంగా ఉండగలిగినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది. పని కాలేదని భ్రమలతో ఎవరినీ నిందించరాదు. దుర్గాదేవికి పూజలు చేయండి.
జ్యేష్టం : సామాన్యంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగండి. ఏ విషయంలో నిరాశ చెందరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. మీరు అనుకున్న విషయాల్లో ఆలస్యం ఉంటుంది. సుబ్రహ్మ ణ్యేశ్వర పూజలు, నవగ్రహ ప్రదక్షిణలు, దానాలు, జపాలు, శివారాధనలు చేయండి.
ఆషాఢం : కొంతవరకు ఊరట ఉంటుంది. ఏ విషయంలోనైనా జాగ్రత్తలు పాటించండి. నిరాశ నిస్పృహలకు అవకాశమివ్వరాదు. సంతోషంగా ఈశ్వర ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణలు, శనిదేవునికి తైలాభిషేకం చేయగలరు.
శ్రావణం : కొంత ఊరట ఉంటుంది. ప్రతి విషయం కత్తిమీద సాములా ఉంటుంది. భయపడకుండా ప్రయత్నములను సరిదిద్దుకొని గ్రామదేవతలకు పూజలు చేయాలి. అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించండి.
భాద్రపదం : కొన్ని విషయాల్లో అనుకూలం. చాకచక్యంగా మాట్లాడి ముందుకు సాగండి. నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు. విఘ్నేశ్వర పూజలు, పితృదేవతలకు పూజలు చేయండి.
ఆశ్వయుజం : మెరుగైన జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఊహించినట్లు జరగనప్పుడు కొన్ని విషయాల్లో ప్రయత్న లోపం గమనించి ఇతరుల సలహాలు, గురువులను ఆశ్రయించి విషయ సేకరణ చేయాలి. దుర్గా నవరాత్రులలో అమ్మవారిని పూజించండి.
కార్తీకం : సామాన్యంగా ఉంటుంది. ఎన్నో విధములుగా పట్టుదలతో ఉండి కార్యదీక్షాపరులుగా ప్రయత్నములు చేయండి. ఏదో దోషం వలన పని అనుకూలత లేదు. కత్తిమీద సాములాగా ఉన్నది. నిరాశ చెందరాదు. వినాయక, కుమారస్వామి, పార్వతీపరమేశ్వరులను పూజించండి.
మార్గశిరం : సామాన్య లాభములు. ఆదాయ వ్యయములకు చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. కోరికలు అదుపులో పెట్టుకొనిన ఏమాత్రం నిరాశ చెందరాదు. అవసరాలకు డబ్బు సమకూరగలదు. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు ఇవ్వండి.
పుష్యం : బంధుమిత్రుల కలయిక, ఆనందమును పొందగలరు. ఆస్తి పంపకాల గురించి వినయంగా పరిష్కరించుకొనుటకు అవకాశాలు. ఆవేశమునకు సమయం కాదు. పితృ దేవతలను సంతృప్తి పరచండి.
మాఘం: అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నములకు అనుకూలమైన రోజులు. ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటే శుభకార్యములు నిర్విఘ్నంగా జరుగును. వాయిదా వేయుటకు ఉన్నది. పట్టుదలగా ముందుకు సాగండి. సూర్యదేవుని ఆరాధన చేయండి.
ఫాల్గుణం : చాలా అనుకూలమైన రోజులు. విందు వినోదములు. వివాహ ప్రయత్నములు. గృహ అలంకార వస్తువులు, వాహనములు కొనగలరు. నవగ్రహ ఆరాధనలు జపాలు ప్రదక్షిణలు తైలాభిషేకము వలన సంతృప్తి ఉంటుంది.