
ఆదాయం : 14
వ్యయం : 14
రాజపూజ్యం : 3
అవమానం : 1
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు; శ్రవణం 1, 2, 3, 4 పాదములు; ధనిష్ఠ 1, 2 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
గురువు 9.4.2024 నుండి 1.5.2024 వరకు మేషరాశిలో తదుపరి 29.3.2025 ఉగాది వరకు వృషభరాశిలో సువర్ణమూర్తిగా సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 మరల ఉగాది వరకు కుంభరాశిలో రజతమూర్తిగా సంచారం. రాహుకేతువులు 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు లోహమూర్తులుగా సంచారం.
ఈ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. కాని అంతలోనే ఏదో తెలియని విఘ్నాలు ఉంటాయి. రైతులకు అనుకూలంగా ఉన్నా ఖర్చులు అదనం. ఒడిదుడుకులతో ఉంటుంది. లాయర్లు, డాక్టర్లకు కలిసొచ్చే కాలం. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిల్వధనం ఖర్చు అయిపోతుంది. కాంట్రాక్టర్లు, రాజకీయాల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెండి బంగారం వాళ్లకి అనుకూలం.
టింబర్, సిమెంట్, స్టీల్ అనుకూలం. ధనం నిలవదు. బిగ్ ఇండస్ట్రీ వాళ్లు స్థిరాస్తిని వృద్ధి చేయగలరు. స్మాల్ ఇండస్ట్రీ వాళ్లకి సామాన్యం. మత్స్య పరిశ్రమ సామాన్యం. పౌల్ట్రీ వాళ్లకి సామాన్యం. వృత్తి, వ్యాపారులకు రాబడి, ఖర్చు ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులకు చాలా బాగుంటుంది. కాని ఏసీబీ దాడులు ఉండగలవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ ఉద్యోగులకు సామాన్యం. సరస్వతి, ద్వాదశ నామాలు చదవని విద్యార్ధులకి జ్ఞాపకశక్తి లేక మార్కులు తగ్గును. సినిమా రంగం వాళ్లకి గతం కన్నా ఆదాయం బాగుంటుంది. భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. పిల్లల విషయంలో కోరికలు పెరిగి ధనవ్యయం చేయగలరు. బంధుమిత్రుల కలహములు. తొందరపాటుతనంతో ఎక్కువ సమస్యలు రాగలవు.
మాట అదుపులో పెట్టుకుంటే గొడవలు రావు. కోర్టు గొడవలు రాగలవు. ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటించగలిగిన వాళ్లకి ఆకస్మిక ధనరాబడి. వస్తు, వాహన యోగం. స్థలములు, ప్లాట్ ఏదో ఒకటి సమకూర్చుకునే అవకాశం. ఆరోగ్య సమస్యలు. చర్మ సంబంధిత సమస్యలు, శరీర కాంతి తగ్గే అవకాశాలు ఉన్నవి. సమయానికి భోజనం చేసి, ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లు జాతి కెంపు ధరించండి. సూర్య ఆరాధన చేయండి. శ్రవణ నక్షత్రం వాళ్లు దుర్గాదేవికి పూజలు, అష్టోత్తర సహస్ర నామాలు చేయండి. అమ్మ వారికి కుంకుమ పూజలు, చంద్ర పూజ ఫలదీపికలు10 పంచండి. ధనిష్ట నక్షత్రం వాళ్లు జాతి పగడం ధరించగలరు. ప్రతి మంగళవారం 450 గ్రా. కందులు నానపెట్టి గోవుకు తినిపించండి.సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గ్రంథములు స్కందగిరిలో పంచండి. భార్యాభర్తలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలరు. అదృష్టసంఖ్య 8.
చైత్రం : కార్యసిద్ధి కలిగి ముందుకు సాగండి. వృత్తి వ్యాపార అనుకూలత. పై అధికారుల మన్ననలు ప్రమోషన్. ఆకస్మిక ధనలాభం. ఏ పరిస్థితులలోనైనా పాజిటివ్‌గా ఉండండి. శ్రీ సూర్యనారాయణ నమః సూర్య ఆరాధన వలన అనుకూలంగా ఉంటుంది.
వైశాఖం : నూతన రంగంలో ముందుకు సాగే అవకాశములు. వ్యక్తిగతానికి అవకాశం ఇవ్వరాదు. కలుపుగోలుగా మాట్లాడగలరు. ఆనందంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గాదేవికి పూజలు చేయండి.
జ్యేష్టం : చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి. ప్రతి విషయంలో ఆచితూచి ఆలోచనలతో ముందుకు సాగండి. పై అధికారుల దగ్గర అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర హోమం చేయండి.
ఆషాఢం : ప్రతి విషయంలో ఆటంకములు. ఆర్భాటములకు సమయం కాదు. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండగలరు. ఏమాత్రం చనువుగా మాట్లాడినా కష్టనష్టములు రాగలవు. సుబ్రహ్మణ్యేశ్వర దుర్గాదేవి పూజలు చేయండి.
శ్రావణం : చాకచక్యంగా మాట్లాడితే లాభం ఉంటుంది. తొందరపాటు, ఏమరుపాటు మిమ్ములను వెనక్కి పంపును. మాటను అదుపులో పెట్టుకొనగలరు. సూర్య, దుర్గాదేవి పూజలు, శివనామ స్మరణ చేయండి.
భాద్రపదం : అధిక శ్రమతో ముందుకు సాగుటకు అవకాశములు ఉన్నవి. విఘ్నేశ్వరుని, పార్వతి పరమేశ్వరులను, సుబ్రహ్మణ్యేశ్వర పూజలు, లక్ష్మీగణపతి హోమం చేయుట వలన ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది.
ఆశ్వయుజం : ఆకస్మికంగా ధనం ఖర్చు చేస్తారు. దుర్గా నవరాత్రులప్పుడు కనకదుర్గాదేవికి పూజలు చేయుటవలన సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఖర్చులు పెరిగి అనేక విధములుగా మాటలు పడగలరు.
కార్తీకం : గత మాసములు కన్నా కొంత వెసులుబాటు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలిం. ఏ విధమైన హామీలు ఉండరాదు. జాగ్రత్తలు తీసుకున్నన్ని రోజులు అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు చేయండి.
మార్గశిరం : కొన్ని విషయాల్లో జాగ్రత్తల వలన ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలం. వివాహ ప్రయత్నములకు ముందుకు సాగండి. సూర్య ఆరాధనతో ఊరట.
పుష్యం : కొన్ని రోజుల నుండి మనసులో తెలియని బాధ. మిగిలిన దోషములకు పెద్దలకు తర్పణలు, అమావాస్య తర్పణలు, పితృ దేవతలను సంతృప్తి చేయండి. ఒత్తిడి తగ్గుతుంది.
మాఘం : ఆశాజనకంగా ఉంటుంది. మీరు జాగ్రత్తలు పాటిస్తున్నారు కనుక ఇబ్బందులు వస్తాయని భయపడవలసిన పనిలేదు. సమర్ధవంతంగా ముందుకు సాగండి. వివాహ ప్రయత్నములు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
ఫాల్గుణం : అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు దూరంగా ఉండండి. ఏ విధమైన ఆటంకములు వచ్చినట్లుగా అనిపించినా భయం వదిలి ముందుకు సాగండి. ప్రయాణములు కలసి రాగలవు. పార్వతీపరమేశ్వర పూజలు సంతృప్తిని ఇవ్వగలవు.