శ్రీ క్రోధి నామ పంచాంగం : తుల రాశి వాళ్లకు తొందరాపాటు పనికిరాదా?

ఆదాయం : 2
వ్యయం      : 8
రాజపూజ్యం : 1
అవమానం  : 5

ఉత్తర 2,3,4 పాదములు; హస్త 1,2,3,4 పాదములు; చిత్త 1, 2 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో

గురువు 9.4.2024 నుండి1.5.2024 వరకు మేషరాశి యందు తదుపరి 29.3.2025 ఉగాది వరకు లోహమూర్తిగా సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు రజిత మూర్తిగా సంచారం. రాహు కేతువులు 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు తామ్ర మూర్తులుగా సంచారం.

ఈ రాశి వాళ్లకు సామాన్య ఫలితములు ఉన్నాయి. రైతులు ముహూర్తబలంతో వ్యవసాయంలో నష్టం రాకుండా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు సామాన్యమైన పరిస్థితులు. తొందరపాటు నిర్ణయములు చేయరాదు. లాయర్లు, డాక్టర్లు జాగ్రత్తలు పాటించండి. కాంట్రాక్టర్లు టెండరు చాలా జాగ్రత్తగా వేయగలరు. రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది. వెండి, బంగారం వ్యాపారులకు అధిక ఆదాయం.

ఏ వ్యాపారంలో ఉన్నవారైనా మానసిక ఒత్తిడి కలిగి ఉన్నారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తేనే మాత్రమే నష్టములు రావు. తీర్థయాత్రలు చేయగలరు. అనారోగ్య సమస్యలు. బంధుమిత్రుల అభినందనలు. ప్రతి విషయం ఎంతో కష్టంగా ఉన్నా కూడా భగవంతుని దయతో కార్యదీక్షకు భంగం కలిగించినా కొంత ఆలస్యంగా పనులు సాధిస్తారు. ఉచిత సలహాలు ఇవ్వరాదు. ఆర్థిక వ్యవహారాలందు చాలా జాగ్రత్తలు తీసుకొనగలరు. కోర్టు విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ఎవరు, ఏ రంగంలో ఉన్నా అనుకూల పరిస్థితులు లేవు.

పరిపూర్ణమైన విశ్వాసంతో కార్యదీక్ష కలిగి ఎవరితో ఏ విధంగా అనేది చాకచక్యంగా మసలుకొంటే ఈ సంవత్సరం అంతా ఎదురీతగా ఉంటుంది. సినిమా వారికి అనుకూలత కనిపించుటలేదు. నిరుద్యోగులకు వ్యతిరేకతలు ఉన్నవి. విద్యార్థులకు మార్కుల కోసం శ్రద్ధగా, ఇష్టంగా ‘నేను పాస్ కావాలి’ అనే పట్టుదలతో చదవాలి. ప్రతిరోజు నిత్య పారాయణ  శరవణభవన అనే నామం జపం చేయడం వల్ల ఉద్రేకం తగ్గి, ఓర్పును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవ్వగలరు. చిత్త నక్షత్రం వాళ్లు పగడం ధరించండి. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు తీర్థయాత్రలు చేయండి.

స్వాతి నక్షత్రం వాళ్లు గోమేదికం ధరించండి. దుర్గాదేవికి ఆరాధన చేయుట వలన అభివృద్ధి కనిపించగలదు. కుంకుమ పూజలు అష్టోత్తర సహస్ర నామాలు చేయండి. విశాఖ నక్షత్రం వాళ్లు కనక పుష్యరాగం ధరించండి. దక్షిణామూర్తికి పూజలు సాయిబాబా పూజలు దర్శనం, శెనగల గుగ్గిళ్లు, ప్రసాదములు, పూజ అనంతరం పంచండి. మహన్యాస రుద్రాభిషేకం, జలాభిషేకం చేయించుకొనుట వలన మానసిక సమస్యలు, ఒత్తిడినుండి బయట పడగలరు. మీరు ఎవరికి హామీ ఉన్నా... తప్పక అప్పులు కట్టవలసి వచ్చును. ఏ విధంగా చూసినా గడ్డు కాలంగా కంటికి కనిపిస్తుంది. శత్రు బాధలకు గురి కాగలరు. భార్యాభర్తల ప్రేమాభిమానములతో కొంత ఉపశాంతి ఉంటుంది. నవగ్రహ జపదానములు ప్రదక్షిణలు తృప్తిని ఇవ్వగలవు. అదృష్టసంఖ్య 6.

చైత్రం : ప్రతి విషయంలో ఆచితూచి నడుచుకొనగలరు. ఆదాయానికి మించిన ఖర్చు అదనంగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయండి.

వైశాఖం:  స్వస్థానం వదలాల్సి ఉంటుంది. కలహాలు, బంధుమిత్రులకు అంతా దూరంగా ఉండగలరు. ఉన్నతంగా మాట్లాడి గౌరవం పెంచుకొనగలరు. ఆర్థికంగా అవసరానికి ధనం సమకూరుతుంది. దుర్గాదేవి పూజలు ఓర్పు ఇస్తాయి.

జ్యేష్టం : ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రతి విషయంలో తక్కువగా మాట్లాడగలరు. పెద్దల సలహాలు తీసుకొనగలరు. ఆవేశానికి సమయం కాదు. ఉద్రేకం వలన అనారోగ్యం కలిగి ఉన్నారు. ధనవ్యయం ఉన్నది. ప్రశాంతంగా ఉండండి. నవగ్రహ ఆరాధన చేయుట, సత్యదేవుని వ్రతం చేయండి.

ఆషాఢం : ప్రతి విషయంలో అనుకూలత. ఎవరికి ఏ విధమైన హామీలు ఇవ్వరాదు. సాక్షి సంతకములు పెట్టరాదు. ఆర్థిక వనరులు కలిగి ఉన్నారు. ఎంత అప్పు తెచ్చినా ఖర్చవుతుంది. ఏదో ఒకటి కొనుటకు మనసు ఇష్టపడుతుంది. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

శ్రావణం : అనేక విధములుగా అభివృద్ధి. ప్రతి విషయంలో ముందంజలో ఉంటారు. పాత బాకీలు తీర్చాలి, ఏదైనా ఖరీదు చేయాలి అనే తపన ఉంటుంది. ఎదుగుదలకు సరైన సమయం. జరిగిపోయిన సమయం తిరిగి రాదు. గురు ప్రార్థన, ఆరాధనలు చేయండి.

భాద్రపదం : కొంత జాగరూకత కలిగి సామరస్యంగా మెలగాలి. ఆకస్మిక వ్యవహార లాభం. న్యాయస్థానంలో అడుగిడు సమయం. ఆవేశానికి, ఆగ్రహానికి గురికాగలరు.

ఆశ్వయుజం : విఘ్నేశ్వరుని ఆరాధనలతో ఆనందంగా ఉంటారు. దేవీ నవరాత్రుల్లో ప్రతినిత్యం ప్రసాదములు పంచండి. ఎంత ఎక్కువగా ప్రసాదములు పంచితే అంత ఫలితం ఉంటుంది.  పితృదేవతల అమావాస్య ఆరాధనలు చేయండి.  అనుకూలంగా ఉంటుంది.

కార్తీకం : నిరంతరం దుర్గాదేవి స్మరణ. ఈశ్వర ఆరాధన. కార్తీకమాస దీపారాధన విజయానికి శుభసూచకం. ప్రతి విషయంలో అనుకూలత. వివాహ ప్రయత్నాల్లో సంతృప్తి. సత్యదేవుని వ్రతమాచరించండి.

మార్గశిరం : చాకచక్యంగా ప్లాన్ చేసుకుంటే ఫలితములు పక్కనే ఉండగలవు. ఆర్థిక లాభం, ధనాదాయం. వనరులు అనుకూలం. పోటీ తత్వం వదిలి నడుచుకొనగలరు. శివారాధనలు చేయుట వలన కార్యసాధన.

పుష్యం : అనుకొన్న పనులు నిర్విఘ్నంగా చేయుటకు తగిన సమయం. ధైర్యంగా ముందుకు సాగండి. ప్రతి పనిలో కార్యసిద్ధి. కోర్టు వ్యవహారాలు రాజీ ప్రయత్నాలతో పరిష్కారం. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయుట అవసరం.

మాఘం : ప్రతి విషయంలో వ్యతిరేకత. అనారోగ్య సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. అఖండ దీపారాధన, కుసుమ నూనెతో దీపారాధన, అమ్మవారి పూజలు ధైర్యాన్ని ఇవ్వగలవు. నవగ్రహ జపదానాలు ఇవ్వండి.

ఫాల్గుణం : కొంతవరకు జాగ్రత్తలు పాటించగలరు. ఆర్భాటానికి సమయం కాదు. అప్పులు చేయరాదు. విశ్వాసంతో ఉంటే ప్రమోషన్ తప్పనిసరిగా రాగలదు. గురువును ఆశ్రయించి ఆనందంగా ఉండండి.