- నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న స్పేస్ క్రాఫ్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్(58) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఈ స్పేస్ క్రాఫ్ట్ మే 7 ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు బయలుదేరనుంది. ఇందులో సునీతా విలియమ్స్‌తోపాటు మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తారు.
ఈ సందర్భంగా సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." నేను ఆధ్యాత్మిక వాదిని. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తుంటే.. ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. మరోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఉత్సాహంగా ఉన్నాను. స్పేస్‌లో సమోసాను తినడమంటే నాకు చాలా ఇష్టం" అని వెల్లడించారు. నాసా తన 'కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్'లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్ క్రాప్ట్ ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది.స్పేస్ క్రాఫ్ట్ అభివృద్ధిలో ఏర్పడిన ఆటంకాల వల్ల మిషన్ చాలా ఏండ్లు ఆలస్యం అయ్యింది. ఈ యాత్ర విజయవంతమైతే స్పేస్ ఎక్స్ కంపెనీ తర్వాత ఐఎస్ఎస్ కు సిబ్బందిని తీసుకెళ్లడం, అక్కడి నుంచి తీసుకురావడానికి ఉపయోగపడే రెండో ప్రైవేట్ సంస్థగా స్టార్‌లైనర్ నిలవనుంది.
322 రోజులు ఐఎస్ఎస్లో..
ఈ అంతరిక్షయానంతో హ్యుమన్-రేటెడ్(మానవ సహిత) అంతరిక్ష నౌకలో ట్రావెల్ చేసిన తొలి మహిళగా సునీతా విలియమ్స్ నిలవనున్నారు. గతంలోనూ ఆమె 2006, 2012లలో రెండుసార్లు స్పేస్‌లోకి వెళ్లారు. మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. మొత్తం 10 స్పేస్ వాక్‌ల ద్వారా ఆమె ఈ ఘనత సాధించారని నాసా గణాంకాలు చెబుతున్నాయి. సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా, తల్లి బోనీ పాండ్యా దంపతులు గుజరాత్‌కు చెందినవారు.