- రూ. 27 కోట్లతో సెగ్మెంట్ లో అభివృద్ధి పనులు ప్రారంభం
అశ్వారావుపేట, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అందిస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 27 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వారావుపేట పట్టణంలోని పెరాయిగూడెం, నెహ్రు నగర్, బండి సుబ్రమణ్యం నగర్, ఏఎస్ ఆర్ నగర్ లలో రూ. 1.55 కోట్లతో సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేశారు.
క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడిచిన 11 నెలల కాలంలో ఒక్క అశ్వారావుపేట మండలంలోనే రూ .9.43 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఇప్పటి వరకు రూ .48 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు, ఎన్ ఆర్ జీ ఎస్ నుంచి రూ.4.21 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌డీఈ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్, నాయకులు జూపల్లి రమేశ్, సుంకపల్లి వీరభద్రరావు, తుమ్మ రాంబాబు, చిన్నం శెట్టి సత్యనారాయణ, ప్రమోద్, వాసం శ్రీను, నిండా హరిబాబు, నార్లపాటి రాములు పాల్గొన్నారు.