అశ్వారావుపేట ఎస్సై మృతి

అశ్వారావుపేట ఎస్సై మృతి
  •  గత నెల 30న పురుగుల మందు తాగిన శ్రీరాముల శ్రీనివాస్​.. చికిత్స పొందుతూ  కన్నుమూత
  • ఆయన మరణవార్త విని గుండెపోటుతో చనిపోయిన మేనత్త

అశ్వారావుపేట / నల్లబెల్లి / నర్సంపేట / పద్మారావునగర్, వెలుగు: సూసైడ్​ అటెంప్ట్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38) మృతి చెందారు. గత నెల 30న ఆయన మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కన్నుమూశారు. వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీరాముల శ్రీను 2015లో ఎస్సైగా జాయిన్​ అయ్యారు. ప్రస్తుతం అశ్వరావుపేట ఎస్సైగా పనిచేస్తున్నారు. 

(మొదటి పేజీ తరువాయి)
సీఐ జితేందర్​రెడ్డి, సహచర కానిస్టేబుళ్ల వేధింపులు తాళలేక తాను గడ్డి మందు తాగి చనిపోతున్నానని జూన్​30న మహబూబాబాద్​ నుంచి 108కు ఫోన్​​ చేశాడు. వెంటనే స్పాట్​కు చేరుకున్న 108 సిబ్బంది ఆయనను వరంగల్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి సీరియస్​గా ఉండడంతో సికింద్రాబాద్​ యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. కాగా,  శ్రీనివాస్​ మృతదేహానికి ఆదివారం హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం  డెడ్​బాడీని స్వగ్రామమైన నారక్కపేటకు అంబులెన్స్​లో తరలించారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 

 గుండెపోటుతో ఎస్సై మేనత్త మృతి

శ్రీరాముల శ్రీనివాస్​ చనిపోయాడన్న విషయం తెలియడంతో వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన ఆయన మేనత్త దార రాజమ్మగుండెపోటుకు గురైంది. కుటుంబసభ్యులు  ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో 
ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొన్నది.

నేషనల్​ హైవేపై నారక్కపేట వద్ద రాస్తారోకో 

ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్​ ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ నల్లబెల్లి - –నర్సంపేట నేషనల్​హైవే రూట్​లోని నారక్కపేట స్టేజీ వద్ద బీఆర్ఎస్​ పార్టీ నాయకులతో పాటు పలు దళిత సంఘాల నాయకులు, కేయూ జేఏసీ లీడర్లు రాస్తారోకో నిర్వహించారు. డెడ్​బాడీతో వస్తున్న అంబులెన్స్​ను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. నేషనల్​ హైవేపై టెంట్​ వేసి 3 గంటల పాటు ఆందోళన చేపట్టారు. వరంగల్​డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్​కుమార్  వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు భధ్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్​ రాజ్​రాస్తారోకో వద్దకు చేరుకున్నారు. చనిపోయిన ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్​ భార్యకు గ్రూప్​ –2 జాబ్​ ఇవ్వాలని, రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని, బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి  డిమాండ్​ చేశారు. శ్రీనివాస్​ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని, డిపార్ట్​మెంట్​పరంగా వచ్చే బెనిఫిట్స్​ అందిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. కాగా, శ్రీనివాస్​ విధులు నిర్వర్తిస్తున్న అశ్వారావుపేట టౌన్​లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్టేషన్ ముందు ప్రత్యేక బలగాలు మోహరించాయి.  శ్రీనివాస్​ ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన సీఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుల్స్​తోపాటు  ఓ పత్రికలో రిపోర్టర్, ఆయన సోదరుడిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళన చేశాయి.  సీఐ కరుణాకర్ వారికి నచ్చజెప్పి పంపించారు.  ------కాగా, శ్రీనివాస్​ సూసైడ్​ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్‌రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
మృతుడికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 

నా భర్త అలాంటోడు కాదు: సీఐ జితేందర్ రెడ్డి భార్య
తన భర్తది కులం పేరుతో దూషించి, వేధింపులకు గురి చేసే మనస్తత్వం కాదని సీఐ జితేందర్ రెడ్డి భార్య పేర్కొంది. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ‘‘నేను కూడా ఓ దళిత బిడ్డనే. అగ్రవర్ణానికి చెందిన నా భర్త దళిత జాతిలో పుట్టిన నన్ను వివాహం చేసుకున్నాడు. కులం పేరుతో దూషించే వ్యక్తి కాదు. దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలి” అని కోరింది.