మహిళా శక్తి ద్వారా జీవనోపాధి పొందాలి : జారే ఆదినారాయాణ

మహిళా శక్తి ద్వారా జీవనోపాధి పొందాలి : జారే ఆదినారాయాణ
  • ఎమ్మెల్యే జారే ఆదినారాయాణ 

చండ్రుగొండ, వెలుగు : మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకం సద్వినియోగం చేసుకొని జీవనోపాధిని మెరుగుపర్చుకోవాలని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. మంగళవారం చండ్రుగొండ లో రూ.90 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. కేజీబీవి స్కూల్ లో తన సొంత ఖర్చులతో రూ.10 వేల విలువైన  క్రీడా సామగ్రిని స్టూడెంట్స్ కు అందజేశారు. కేజీబీవి స్కూల్ లో రూ.47.50 లక్షల విలువైన మౌలిక వసతుల అభివృద్ధికి భూమి పూజ చేశారు. 

స్థానిక ఎంపీడీవో ఆఫీసులో మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన రూ.9లక్షల విలువైన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. పీహెచ్ పీ ని సందర్శించి చికిత్స పొందుతున్న పేషెంట్లను పరామర్శించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అలర్ట్ గా ఉండాలని  మెడికల్ సిబ్బందిని ఆదేశించారు.   గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రూ.100 కోట్ల తో కనకగిరి గుట్టలను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. 

మునగ, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకాల కోసం ప్రభుత్వం పూర్తి సబ్సిడీ పై  అందజేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అశోక్, తహసీల్దారు సంధ్యారాణి, ఎంఈవో సత్యనారాయణ, ఎపీఎం సంతోష్, లీడర్లు కృష్ణారెడ్డి, భోజ్యానాయక్, రమణ, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.