స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి

  •     రెండు మండలాల్లో నోటీసులు ఇచ్చిన మెంబర్లు
  •     4 ఏండ్ల పదవీకాలం కంప్లీట్​కావడంతో పావులు కదుపుతున్న సభ్యులు 

కామారెడ్డి, వెలుగు : మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల పర్వం రాజకీయ అలజడిని సృష్టిస్తోంది. ఎన్నికలు జరిగి నాలుగేండ్లు కంప్లీట్​అవుతుండడంతో ఎంపీపీలు, వైస్​ ఎంపీపీలపై సభ్యులు అవిశ్వాసాలు పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలోని 2 మండలాల్లో అవిశ్వాసాల కోసం వినతులు అందాయి.  

ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఎంపీపీలు, వైస్​ఎంపీపీల పదవుల్లో ఉన్నచోట అవిశ్వాసాలు పెట్టి, తమ ఖాతాల్లో వేసుకునేందుకు అధికార బీఆర్ఎస్​ యత్నిస్తోంది. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట ఇన్​చార్జి ఎంపీపీ రాజ్​దాస్, ఎల్లారెడ్డి వైస్​ఎంపీపీ నర్సింలుపై అవిశ్వాసం పెడుతూ ఆయా మండలాల్లో మెజార్టీ సభ్యులు ఎల్లారెడ్డి ఆర్డీవో శీనుకు నోటీసులిచ్చారు. 

రాజకీయంగా సత్తా చాటేందుకు..

రాజకీయంగా సత్తా చాటేందుకు స్థానిక సంస్థల్లో అవిశ్వాసాలు పెడుతున్నారు. ఒకే పార్టీలో ఎంపీపీ, వైస్​ఎంపీపీ పదవి కోసం పోటీపడిన సందర్భంలో, పార్టీలు మారిన తరుణంలో, సభ్యులు స్థానికంగా తన ఉనికిని చాటేందుకూ ఈ ఎత్తుగడను ఉపయోగిస్తారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. 2019లో ఎంపీపీ ఎన్నికలప్పుడు 10 ఎంపీటీసీ స్థానాలున్న నాగిరెడ్డిపేట మండలంలో కాంగ్రెస్​మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది.  ఎంపీపీ పదవి జనరల్​కు రిజర్వయింది. కాంగ్రెస్​నుంచి ఇద్దరు ఈ పదవి కోసం పోటీపడగా పోచారం ఎంపీటీసీ వినీతను అధిష్టానం సెలక్ట్​చేసింది. అదే పార్టీకి చెందిన ధర్మారెడ్డి ఎంపీటీసీ కృష్ణవేణి రెబల్​గా పోటీ చేశారు. ఇద్దరికీ సమానంగా అయిదేసి ఓట్లు వచ్చాయి. ఆఫీసర్లు డ్రా తీయగా కృష్ణవేణి గెలిచింది.

వైస్​ఎంపీపీగా తాండూర్​ ఎంపీటీసీ రాజ్​దాస్​కు పదవి దక్కింది. కృష్ణవేణిపై కాంగ్రెస్​పార్టీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో విప్​ ధిక్కారణ కింద ఆమె పదవిని కోల్పోయారు. వైస్​ఎంపీపీ రాజ్​దాస్​ అప్పటి నుంచి ఇన్​చార్జి ఎంపీపీగా కొనసాగుతున్నారు. రాజ్​దాస్​పై అధికార పార్టీ గుర్రుగా ఉంది. 4 ఏండ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేక, సైలెంట్​గా ఉన్నారు. ప్రస్తుతం 4 ఏండ్లు కంప్లీట్​కావడంతో ఆయన్ను పదవి నుంచి తప్పించాలని భావించి, ఇటీవల 8 మంది సభ్యులు ఆర్డీవోకు నోటీస్​ఇచ్చారు. ఎల్లారెడ్డిలో గతంలో కాంగ్రెస్​తరఫున గెలిచిన మాధవి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

కొన్నాళ్ల కింద ఆమె బీఆర్ఎస్​లో చేరారు. వైస్​ఎంపీపీ నర్సింలు కాంగ్రెస్​లోనే ఉన్నారు. నర్సింలును పదవి నుంచి దించి అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీని వైస్​ఎంపీపీ గా ఎన్నుకునాలనే ఉద్దేశంతో 3 రోజుల కింద మెజార్టీ సభ్యులు నోటీసులిచ్చారు. గాంధారి ఎంపీపీ రాధ(బీఆర్ఎస్)పై కూడా అదే పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు కొద్ది రోజుల కింద తిరుగుబావుట ఎగిరేశారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్​జోక్యం చేసుకోవడంతో  
సద్దుమణిగింది.

సొంత పార్టీ ఎంపీపీలపై గుర్రు..

కామారెడ్డి, జుక్కల్​నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో ఎంపీపీలపై సొంత పార్టీ సభ్యులు గుర్రుగా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని సైలెంట్​గా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో అవిశ్వాసాల పేరిట ఇప్పుడున్న వారిని దించి, కొత్త వారికి పదవి కట్టబెడితే విభేదాలు తలెత్తయని భావిస్తున్నారు.

దోమకొండ ఎంపీపీ పదవి కోసం ఇద్దరు బీఆర్ఎస్​కు చెందిన వారు 4 ఏండ్ల కింద పోటీ పడగా చెరో రెండున్నర ఏండ్ల పాటు సర్దుబాటు చేశారు. ఇందులో భాగంగా ఏడాది కింద దోమకొండ ఎంపీపీని మార్చారు.