
కాగజ్ నగర్, వెలుగు : ఇది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి ఎంపీడీఓ ఆఫీస్. సోమవారం ఉదయం11 గంటలైనా ఒక్క అధికారి, సిబ్బంది రాలేదు. తాత్కాలిక అటెండర్ సాయి మాత్రమే ఆఫీస్ లో ఉన్నాడు. గతేడాది ఉపాధి హామీ కూలీ డబ్బులు వేరే అకౌంట్ లో పడ్డాయని, సమస్యను చెప్పుకోవడానికి భూరెపల్లికి చెందిన గ్రామస్తులు ఎంపీడీఓ ఆఫీస్ కు వచ్చారు.
ఆఫీసర్లు రాకపోడంతో ఇలా మెట్లపై కూర్చున్నారు. మరికొందరు ఇతర పనుల కోసం వేచిఉన్నారు. ఈ విషయమై ఎంపీడీఓ ప్రసాద్ ను సంప్రదించగా, కౌంటలలో మీటింగ్ అటెండ్ అయ్యేందుకు వచ్చానని, మిగిలిన స్టాఫ్ రాలేదా? అని ఎదురు ప్రశ్న వేశారు.
ఉపాధి హామీ ఆఫీస్ లో కేవలం కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే ఉంటారని, వాళ్లూ తనతోనే వచ్చారన్నారు. ఈజీఎస్ ఏపీఓ గోవర్ధన్ ను సంప్రదించగా, ఆఫీస్ కు అవసరమైన ఏ4 పేపర్ల కోసం కాగజ్ నగర్ లో ఆగానని, రావడానికి టైమ్ పడుతుందని చెప్పారు.