జనగామ, వెలుగు : జనగామ పీఎస్‌లో అడ్వకేట్ దంపతులపై దాడి చేసిన పోలీసులపై వేటు పడింది. నాలుగు రోజుల క్రితం ఓ కేసు గురించి మాట్లాడేందుకు పీఎస్‌కు వెళ్లిన న్యాయవాదులు గద్దల అమృతరావు, కవిత దంపతులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ కూడా సోషల్‌మీడియాలో వైరలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లు ఆందోళనలకు దిగారు.
నిరసనలతో హోరెత్తించడంతో పోలీసుశాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై బుధవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్ కేసులు నమోదు చేశారు. గురువారం వారిపై బదిలీ వేటు పడింది. జనగామ సీఐ ఎల్ రఘుపతి రెడ్డి, ఎస్ ఐ తిరుపతిని వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిశోర్ ఝా గురువారం ఉత్తర్వులిచ్చారు.
కానిస్టేబుల్ బి కరుణాకర్‌ను ఏఆర్ కు అటాచ్ చేశారు. వరంగల్ సీసీఎస్‌లో డ్యూటీ చేస్తున్న దామోదర్ రెడ్డిని జనగామ సీఐగా నియమించారు. అయితే, కారకులైన పోలీసులను సస్పెండ్ చేసే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని లాయర్లు తేల్చి చెప్పారు.