అప్ఘనిస్తాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. రాజధాని కాబుల్‌లోని ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు.
కాబుల్‌లోని స్థానిక ఖలీఫా సాహిబ్ మసీదు వద్ద శుక్రవారం (ఏప్రిల్ 29న) మధ్యాహ్నం రంజాన్ ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముందుగా 10 మంది గాయపడినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అయితే సాయంత్రం వరకు మృతుల సంఖ్య 50కి పైగా పెరిగినట్లు వెల్లడించారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు.
ఘటన తర్వాత ఎటు చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలే కన్పిస్తున్నాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ పేలుడు వెనుక ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
రంజాన్ నెల ప్రారంభమైన తర్వాత గత కొద్ది రోజులుగా అఫ్గాన్‌లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గత 10 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో 11 ఉగ్రదాడులు సంభవించాయి. పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గతవారం మజర్ ఈ షెరీఫ్ పట్టణంలోని ఓ మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించారు.
మరిన్ని వార్తల కోసం..