
వీకెండ్ పార్టీ.. పబ్ లో పార్టీ జోరుగా సాగుతుంది.. ఎవరికి వాళ్లు మందు కొట్టి డాన్సులు చేస్తున్నారు.. కేకలు వేస్తున్నారు.. గంతులేస్తున్నారు.. అందరూ మంచి మూడ్ లో హ్యాపీగా పార్టీ చేసుకుంటున్న సమయంలో భీకరమైన కాల్పులు.. తుపాకీతో ఓ వ్యక్తి తూటాలతో విరుచుకుపడ్డాడు.. ఈ ఘటన జరిగింది కెనాడా దేశ రాజధాని టొరంటాలో.. పూర్తి వివరాల్లోకి వెళితే..
కెనడాలోని టొరంటాలో సిటీలోని స్కార్ బరో ఏరియా. అక్కడ ఓ పబ్ ఉంది. వీకెండ్ శుక్రవారం రాత్రి పార్టీ కోసం పెద్ద సంఖ్యలో యువత వచ్చారు. పబ్ లో డీజే సౌండ్స్ ఉన్నాయి. ఇదే సమయంలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి.. తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో పబ్ లోని యువత పరుగులు తీశారు. ఆ సమయంలో కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు ఆ ఆగంతకుడు. మొత్తం 12 మందికి బుల్లెట్ గాయాలు అయినట్లు పోలీసులు వెల్లడించారు.
కాల్పుల తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదని.. గాయపడిన వాళ్లకు ప్రాణాపాయం లేదని వెల్లడించారు వైద్యం చేస్తున్న డాక్టర్లు. ఈ కాల్పులు జరిపింది ఎవరో తెలిస్తే.. ఎందుకు కాల్చాడు.. కారణాలు ఏంటీ అనేది బయటకు వస్తాయని చెబుతున్నారు విచారణ అధికారులు.