- 24 మందికి గాయాలు, నలుగురికి సీరియస్
- ఉత్తరాఖండ్‌లోని మార్చులా వద్ద ఘోర ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దీంతో 36 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 24 మందికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 43 సీట్లున్న బస్సు 60 మందితోప్రయాణిస్తుండటంతోనే కంట్రోల్ తప్పి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సులో ఉన్నవాళ్లంతా దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లి వస్తున్నవారేనని తెలిపారు.
200 మీటర్ల లోయలో పల్టీ
గర్వాల్ ప్రాంతం నుంచి కుమావ్‌లోని రామ్‌నగర్‌కు వెళ్తుండగా సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రామ్‌నగర్‌కు మరో 35 కిలోమీటర్లుందనగా అల్మోరాలోని మార్చులా వద్ద బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోయలో పడిపోయింది. కొండ ప్రాంతం కావడంతో బండరాళ్లమీదుగా బస్సు పల్టీలు కొడుతూ లోయలోని నదీప్రవాహానికి దగ్గరలో ఆగిపోయింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నుజ్జునుజ్జయిన బస్సులోంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. గాయపడినోళ్లను రాంనగర్‌లోని ఆస్పత్రికి, తీవ్రంగా గాయపడిన నలుగురిని రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అల్మోరా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారిని సస్పెండ్ చేసింది.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయాలైనోళ్లకు రూ.50 వేల చొప్పున ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్, మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా సాయం అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడినవారికి రూ. ఒక లక్ష పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.