- 2020 ఏప్రిల్ లో చైనా అక్రమ నిర్మాణాలు కట్టిందని.. ఇండియా బ్రిడ్జిని కూల్చేసిందని వెల్లడి
- ‘గల్వాన్ డీకోడెడ్’ పేరుతో ఆస్ట్రేలియా పత్రిక కథనం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: గల్వాన్ లోయలో రెండేండ్ల కిందట ఇండియా, చైనా సోల్జర్ల మధ్య జరిగిన గొడవలో చైనా వైపు 42 మంది సోల్జర్లు చనిపోయారని ‘ద క్లాక్సన్’ అనే ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. తమ వైపు నలుగురే చనిపోయారని చైనా చేసిన ప్రకటన అబద్ధమని తేల్చిచెప్పింది. సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ల ఆధారంగా ఆ పత్రిక ‘గల్వాన్ డీకోడెడ్’ పేరిట కథనాన్ని వెలువరించింది. కొందరు వీబో యూజర్లు పెట్టిన పోస్టులను, వీడియోలను ఇందులో ప్రస్తావించింది.
‘‘గల్వాన్ లోయలో 2015, జూన్ 6న చైనా, ఇండియా సోల్జర్ల మధ్య గొడవ జరిగింది. దురాక్రమణకు దిగిన చైనీస్ సోల్జర్లతో మాట్లాడేందుకు ఇండియన్ ఆర్మీ నుంచి కర్నల్ సంతోష్ బాబు బృందం గల్వాన్ లోయకు చేరుకుంది. చైనా ఆర్మీ కర్నల్ ఖీ ఫబావో మాత్రం 150 మంది సోల్జర్లతో వచ్చారు. చర్చలకు బదులుగా దాడికి ఆదేశించారు. దీంతో రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఆ తర్వాత ప్యానిక్ అయిన చైనా సోల్జర్లు వెనక్కి పారిపోయారు. ఈ క్రమంలో వెపన్స్ ధరించిన 38 మంది నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలింది” అని ఆస్ట్రేలియన్ పత్రిక వివరించింది. సోల్జర్ల డెడ్ బాడీలను ముందుగా షిఖ్వానే మార్టైర్ సిమెటరీకి తీసుకెళ్లి, ఆ తర్వాత వాళ్ల సొంతూళ్లకు పంపించారు’’ అని పేర్కొంది. ఇండియాతో జరిగిన ఒప్పందాలను తుంగలో తొక్కి బఫర్ జోన్లో చైనా ఆర్మీ నిర్మాణాలు చేపట్టిందని ఆ పత్రిక వెల్లడించింది. 2020 ఏప్రిల్ నుంచే ఆ ప్రాంతంలో సైనిక నిఘానూ పెంచిందని చెప్పింది. బఫర్ జోన్లో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగిస్తామని చెప్పిన చైనా సైన్యం.. మాట తప్పిందని, పైగా నదిపై ఇండియా కట్టించిన బ్రిడ్జిని కూల్చి వేసిందని పేర్కొంది.
‘పొరుగు ముప్పు’కు ఇవి ట్రైలర్స్: ఆర్మీ చీఫ్
పొరుగు దేశాలతో మున్ముందు ఎదుర్కోబోయే ప్రమాదాలకు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు కేవలం ట్రైలర్లేనని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే అన్నారు. ఆ దేశాల చర్యలతో పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. పొరుగుదేశాల వల్ల కలిగే దేశ భద్రతా సవాళ్లపై గురువారం జరిగిన ఓ ఆన్లైన్ సెమినార్లో ఆయన మాట్లాడారు. చైనా, పాక్‌ల పేర్లు ఎత్తకుండానే ఆ దేశాల వల్ల ఎదురవ్వబోయే ముప్పులను వివరించారు. అయితే, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో సన్నద్ధంగా ఉన్నామన్నారు.
ఒలంపిక్స్ వేడుకలకు ఇండియా దూరం
గల్వాన్ ఘర్షణకు కారణమైన చైనా కర్నల్ ను టార్చ్‌బేరర్‌గా నియమించడంతో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను ఇండియా బాయ్‌కాట్ చేసింది. బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ డిప్లొమాట్ ఆ వేడుకలకు హాజరుకాబోరని మన ఫారిన్మినిస్ట్రీ ప్రకటించింది. చైనా ఒలింపిక్స్‌ను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఆ కార్యక్రమం లైవ్‌ను తాము ప్రసారం చేయడం లేదని ప్రసార భారతి చీఫ్ శశి శేఖర్ కూడా ప్రకటించారు.
మారణహోమం చేసినోడు టార్చ్ బేరరా?: అమెరికా
గల్వాన్ గొడవలో మారణహోమానికి పాల్పడిన కర్నల్ ఖీ ఫబావోను బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్‌గా చైనా నియమించడంపై అమెరికా మండిపడింది. ఒలింపిక్స్ రిలేలో నాలుగు సార్లు షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్వాంగ్ మెంగ్ నుంచి ఫబావో టార్చ్ (ఒలింపిక్ జ్యోతి)ని అందుకున్నాడు. ఈ చర్యతో ఒలింపిక్స్‌కు డ్రాగన్ కంట్రీ రాజకీయ రంగు పులిమిందని అమెరికా ఆరోపించింది. ‘‘2020లో ఇండియన్ సోల్జర్లపై దాడికి పాల్పడిన సైనికుడిని, వీగర్ ముస్లింలను ఊచకోత కోసిన వ్యక్తిని వింటర్ ఒలింపిక్స్‌కు చైనా టార్చ్‌బేరర్‌గా నియమించడం ఓ సిగ్గుమాలిన చర్య. వీగర్ల స్వేచ్ఛ, ఇండియా సావర్నిటీకి అమెరికా ఎప్పుడూ మద్దతిస్తుంది’’ అని అమెరికా సెనేట్ ఫారిన్రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ జిమ్ రిష్ ట్వీట్ చేశారు.