బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినాస్ గెరైస్ స్టేట్ లో హైవేపై వెళ్తున్న బస్సు ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. టెయోఫిలో ఒటోని సమీపంలోని ఫెర్నావో డయాస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
డిసెంబర్ 21 తెల్లవారుజామున 4 గంటలకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు ఊడిపోవడంతో అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. మరో వాహనం కూడా బస్సును ఢీ కొట్టింది. అయితే అందులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కొంత మంది లోపల చిక్కుకుపోయారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది శిథిలాల లోపల నుంచి కాలిపోయిన మృతదేహాలను వెలికి తీశారు.