న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లపై ప్రజలు తిరగబడుతున్నారు. టెర్రరిస్టుల నుంచి దేశాన్ని విడిపించేందుకు ఒక్కటవుతున్నారు. యాంటీ తాలిబాన్ కమాండర్ ఖైర్ మహమ్మద్ అందరాబీ నేతృత్వంలో ఉత్తర బగ్లాన్ ప్రావిన్స్‌లోని పోల్ ఏ హెసార్, దేహ్ సలాహ్, బను జిల్లాలను తాలిబాన్ల నుంచి ప్రజలు విడిపించారు. తాలిబాన్ జెండాల స్థానంలో ఆఫ్గాన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజల దాడిలో సుమారు 40 మంది తాలిబాన్లు మృతి చెందారని, 15 మంది గాయపడ్డారని అక్కడి లోకల్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. మరిన్ని జిల్లాలను కూడా తాలిబాన్ల నుంచి విముక్తి చేయబోతున్నామని ఖైర్ మహమ్మద్ నేతృత్వంలోని టీమ్ చెప్పినట్టు వెల్లడించాయి. మూడు జిల్లాలు మళ్లీ ప్రజల అధీనంలోకి వచ్చినట్టు అఫ్గాన్ మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ముహమ్మదీ కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం బిస్మిల్లా పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో ఉన్నారు. ఈ ప్రావిన్స్ మాత్రమే ప్రస్తుతం తాలిబాన్ల కంట్రోల్‌లో లేదు.
మా వాళ్లు దాడి చేస్తే దర్యాప్తు చేస్తం: తాలిబాన్లు
తాలిబాన్ ఫైటర్లెవరైనా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే దర్యాప్తు చేస్తామని టెర్రరిస్టు గ్రూప్‌కు చెందిన ఓ ప్రతినిధి చెప్పారు. న్యాయ, మత, విదేశాంగ విధానానికి సంబంధించి తాలిబాన్లలోని ఎక్స్‌పర్ట్స్ త్వరలోనే కొత్త విధానం వెల్లడిస్తారని అన్నారు.
అఫ్గాన్‌లో తాలిబాన్ కో ఫౌండర్ బరాదర్
ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న చర్చల్లో తాలిబాన్ కో ఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పాల్గొన్నారని అఫ్గాన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. శనివారం ఆయన కాబుల్ వచ్చారన్నారు. 2018లో పాకిస్తాన్‌లో అరెస్టు చేసిన బరాదర్‌ను అమెరికా ఒత్తిడితో 2018 వరకు అక్కడే నిర్బంధించారు. అక్కడ్నుంచి తరలించి దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయానికి హెడ్‌గా నియమించారు. అఫ్గాన్‌లో 20 ఏండ్ల నుంచి ఉన్న యూఎస్ ఫోర్సెస్‌ను విత్ డ్రా చేయడానికి జరిగిన అగ్రిమెంట్‌లో సంతకాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ తాలిబాన్లకు మద్దతు ప్రకటించారు.
తజకిస్థాన్ టు ఇండియా
ఫ్గాన్ నుంచి ఇండియన్ల తరలింపు కొనసాగుతోంది. ఐఏఎఫ్ ట్రాన్స్‌పోర్ట్ విమానం 80 మందితో కాబూల్ నుంచి శనివారం బయలుదేరింది. తజకిస్థాన్‌లోని దుషన్బే ప్రాంతంలో ఆ విమానం దిగిందని, సాయంత్రం కల్లా ఢిల్లీకి దగ్గర్లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఐఏఎఫ్‌కు చెందిన మరో విమానం కాబుల్ ఎయిర్‌పోర్టులో ఉందని, మరికొంత మంది ఇండియన్లతో త్వరలోనే ఇండియా వస్తుందని వెల్లడించాయి.
కాబూల్ గురుద్వారా వీడియో రిలీజ్
అఫ్గాన్‌లో ఉంటున్న దాదాపు వెయ్యి మంది హిందువులు, సిక్కులు తమ ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్పారని హోం శాఖ అధికారులు తెలిపారు. వీళ్లలో 280 మంది సిక్కులు, హిందువులు కాబూల్‌లోని ఒక గురుద్వారా దగ్గర ఉన్నారని తెలిసింది. గురుద్వారాకు సంబంధించిన ఓ వీడియోను తాలిబాన్ల స్పోక్స్‌పర్సన్ ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గురుద్వారాలో ఉన్న వాళ్లెవరూ భయపడాల్సిన అవసరం లేదని, తమ లీడర్లు సిక్కు లీడర్లతో మాట్లాడారని ట్వీట్ చేశారు.
తాలిబాన్ సపోర్ట్ పోస్టులు.. 14 మంది అరెస్టు
అస్సాంలో తాలిబాన్లను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లలో ఒకరు ఎంబీబీఎస్ చదువుతున్నారని తెలిపారు. వీళ్లలో కొందరు డైరెక్టుగా తాలిబాన్లకు సపోర్ట్ తెలిపారని, మరికొందరు ఇండియా తాలిబాన్లను సపోర్ట్ చేయడం లేదని విమర్శించారని చెప్పారు.
కాబూల్‌లో మనోళ్లు సేఫ్
కాబూల్‌లోని ఇండియన్లు సేఫ్‌గా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాళ్లతో అధికారులు టచ్‌లో ఉన్నారన్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు బయట వెయిట్ చేస్తున్న ఇండియన్లు సహా 150 మందిని తాలిబాన్లు శనివారం కిడ్నాప్ చేసినట్టు వార్తలొచ్చాయి. అలాంటిదేమీ లేదని తాలిబాన్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు బయట ఉన్నోళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి డాక్యుమెంట్లు పరిశీలించి వదిలిపెట్టామన్నారు. ప్రస్తుతం వాళ్లంతా ఎయిర్‌పోర్టులో ఉన్నట్టు తెలిసింది. వీలైనంత మంది ఇండియన్లను తీసుకొచ్చేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టులో మరో విమానాన్ని రెడీగా ఉంచామని అధికార వర్గాలు తెలిపాయి.