బ్రెజిల్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. బ్రెజిల్ లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయి.. వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. బైక్ లు, కార్లు, ఇతర వాహనాలు బురదల్లో చిక్కుకుపోయాయి. వర్షాల కారణంగా 56మంది మృతి చెందగా.. మరో 76 మంది తప్పిపోయినట్లు రాష్ట్ర సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అధికారులు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒక నెలలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులోనే కురుస్తోంది.అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని బ్రెజిల్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
చాలా రాష్ట్రాలలు ఇంకా వరదలోనే ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీ వరదలకు కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్నాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా..అన్ని ప్రాంతాలకు సరైన సహాయక చర్యలు అందక..ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయం, ఆహారం కోసం ఇంకా వేలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గవర్నర్ ఎడ్వర్డో లైట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ప్రభావిత ప్రాంతంపై అధికారులతో చర్చించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 విమానాలు, 45 వాహనాలు, 12 పడవలు 626 మంది సైనికులతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు. రోడ్లను క్లియర్ చేయడం, ఆహారం, నీరు, పరుపులు వంటి అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. అలాగే..నిరాశ్రులైన వ్యక్తుల కోసం ఆశ్రయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన గుయిబా నది ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నదులు, కొండ ప్రాంతాలకు సమీపంలో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఏజెన్సీ ఆదేశించింది..