లెబనాన్‌లో పేలిన పేజర్లు.. 8 మంది మృతి

లెబనాన్‌లో పేలిన పేజర్లు.. 8 మంది మృతి
  • ఇజ్రాయెల్‌‌ పనేనని హెజ్బొల్లా ఆరోపణ

బీరుట్: లెబనాన్‌‌లో మంగళవారం సాయంత్రం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు తమ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ పేజర్లు ఒకేసారి బ్లాస్ట్‌‌ అయ్యాయి. ఈ ఘటనలో దేశ వ్యాప్తంగా ఓ బాలికతో సహా ఎనిమిది మంది మరణించారు. హెజ్బొల్లా సభ్యులు సహా 2,750 మంది గాయపడ్డారు. వారిలో 200 మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని లెబనాన్‌‌ హెల్త్ మినిస్టర్ ఫిరాస్ అబియాడ్ వెల్లడించారు. చాలా మందికి ఎక్కువగా ముఖం, చేతులు, కడుపుపైనే గాయాలు అయ్యాయని తెలిపారు. గాయపడినవారికి ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు. 

దక్షిణ లెబనాన్, తూర్పు బెకా వ్యాలీ, బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని ఆసుపత్రులు పేలుళ్లలో గాయపడిన బాధితులతో కిక్కిరిసిపోయాయని వెల్లడించారు. పేజర్ పేలుడులో  లెబనాన్ పార్లమెంట్‌‌లోని హెజ్బొల్లా  ప్రతినిధి అలీ అమ్మర్ కొడుకు మృతి చెందినట్లు సౌదీ మీడియా సంస్థ అల్ హదత్ పేర్కొంది. లెబనాన్‌‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.  సిరియాలోనూ పేజర్లు పేలి పద్నాలుగు మంది గాయపడ్డారు. పేజర్ల పేలుడు ఘటనతో తమ గ్రూప్ సభ్యులను హెజ్బొల్లా అలెర్ట్ చేసింది.పేజర్లు కలిగి ఉన్న వ్యక్తులు వాటికి దూరంగా ఉండాలని సూచించింది. వైర్ లెస్ పరికరాలను ఉపయోగించవద్దని కోరింది. కాగా..పేజర్ల పేలుడుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

ఇది ఇజ్రాయెల్‌‌ పనే: హెజ్బొల్లా
తమ గ్రూప్ సభ్యులే టార్గెట్ గా ఇజ్రాయెల్‌‌ ఈ దాడికి పాల్పడిందని హెజ్బొల్లా ఆరోపించింది. పేజర్లను కొత్త టెక్నాలజీ ద్వారా పేల్చేశారని తెలిపింది. ఈ దాడితో ఇజ్రాయెల్ అతిపెద్ద భద్రతా ఉల్లంఘనకు పాల్పడిందని మండిపడింది. అయితే,పేజర్లలోని లిథియం బ్యాటరీలు వేడెక్కడం వల్లే పేలుళ్లు సంభవించాయని కొన్ని నివేదికలు పేర్కొనగా.. సరఫరా చేయడానికి ముందు పేజర్ల లోపల పేలుడు పదార్థాలను పెట్టినట్లు మరికొన్ని నివేదికలు ఆరోపించాయి.