- మహాకుంభ మేళాకు పోటెత్తుతున్న భక్తులు
- రామ్నాథ్ కోవింద్, సుధామూర్తి, గౌతమ్ అదానీ పూజలు
మహాకుంభనగర్(యూపీ): ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళా మంగళవారంతో 9వ రోజుకు చేరుకున్నది. ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల నుంచి కూడా భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని స్నానాలు ఆచరిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన కుటుంబ సభ్యులతో మహాకుంభ మేళాను సందర్శించారు.
త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్ ప్రీతి అదానీ మహా కుంభమేళాకు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఇస్కాన్ క్యాంపును సందర్శించారు. అక్కడ మహాప్రసాద మండపంలో భోజనం వండటంలో సహాయం చేశారు. రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా తన ఫ్యామిలీతో త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. మూడు రోజుల పాటు రాజస్నానం ఆచరించనున్నట్లు ఆమె తెలిపారు.
స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ కూడా మేళాలో పాల్గొన్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో కప్ కొట్టాలని కోరుతూ ఆర్సీబీ టీమ్ జెర్సీని ఓ భక్తుడు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కూడా మేళాను సందర్శించి రాజస్నానం ఆచరించారు. అదేవిధంగా, కిన్నార్ అఖాడాకు చెందిన 3వేల మంది ట్రాన్స్జెండర్లు కూడా మేళాలో పాల్గొన్నారు.